కలం, వెబ్‌డెస్క్: మెడికల్ ఎంట్రెన్స్ టెస్ట్ నీట్-యూజీ (NEET UG) నిర్వహణలో సమూల మార్పులకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పేపర్ లీకేజీ, తీవ్ర నిరసనల నేపథ్యంలో.. పరీక్ష నిర్వహణలోని లోపాలపై సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ బుధవారం సుప్రీంకోర్టుకు అఫిడవిట్ సమర్పించింది. అందులో భవిష్యత్తులో నీట్ పరీక్షను పూర్తిగా కంప్యూటర్-బేస్డ్ టెస్ట్ (ఆన్లైన్) విధానంలో నిర్వహించే దిశగా ఆలోచన చేస్తున్నట్లు కోర్టుకు నివేదించింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిర్వహిస్తున్న ప్రధానమైన ఎనిమిది పరీక్షల్లో ఇప్పటికే ఏడు పరీక్షలు సీబీటీ విధానంలోనే జరుగుతున్నాయి. మిగిలిన నీట్‌ను కూడా ఆ జాబితాలోనే చేర్చేందుకు సిద్ధమవుతున్నట్లు కేంద్రం వెల్లడించింది. అయితే, నీట్ పరీక్ష రాసే అభ్యర్థుల్లో గ్రామీణ ప్రాంతాలకు చెందినవారు, ముఖ్యంగా అమ్మాయిల సంఖ్య భారీగా ఉంటున్నందున.. ఈ ఆన్లైన్ విధానం వల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని వర్గాలతోనూ లోతుగా చర్చలు జరుపుతున్నట్లు కేంద్రం తెలిపింది. లక్షలాది మంది అభ్యర్థులు పాల్గొనే ఈ పరీక్షను దేశవ్యాప్తంగా ఒకే సెషన్లో కాకుండా, జేఈఈ తరహాలో పలు దశల్లో (మల్టీ షిఫ్ట్స్/సెషన్స్) నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వివరించింది.
కట్టుదిట్టమైన మానిటరింగ్
– పేపర్ లీకేజీలకు తావులేకుండా ప్రశ్నాపత్రాల తయారీలో అత్యున్నత భద్రతా ప్రమాణాలు పాటించనున్నట్లు కేంద్రం సుప్రీంకోర్టుకు వివరించింది.
– దేశంలోని టాప్ యూనివర్సిటీలకు చెందిన నిపుణులతో ఒక సీక్రెట్ ప్లేస్‌లో ప్రశ్నాపత్రాలను తయారు చేయిస్తారు.
– పేపర్ తయారీ ప్రక్రియ ప్రారంభమైన నాటి నుంచి టెస్ట్ ముగిసే వరకు సదరు నిపుణులకు బయటి ప్రపంచంతో ఎలాంటి సంబంధం లేకుండా అదే ప్రాంతంలో ఉంచుతారు.
– ఈ కేంద్రాల వద్ద ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు లేదా ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించరు. 24 గంటల పాటు సాయుధ బలగాల పటిష్ట భద్రతను ఏర్పాటు చేస్తారు.
ఐదు ప్రశ్నాపత్రాలు
ప్రశ్నా పత్రాల తయారీలోనూ కఠిన నిబంధనలు అమలు చేస్తామని కేంద్రం వివరించింది. ఒకవేళ అత్యవసర పరిస్థితులు ఏర్పడితే ఎదుర్కొనేందుకు వీలుగా.. ఒకే ప్రశ్నాపత్రానికి బదులుగా అదనంగా ఐదు సెట్లు సిద్ధంగా ఉంచుతామని తెలిపింది. ఏదైనా కారణం చేత ఒక పేపర్ లీక్ అయితే, వెంటనే మరో ప్రత్యామ్నాయ పేపర్‌తో పరీక్షను సజావుగా నిర్వహించేలా పకడ్బందీ ఏర్పాట్లు చేయనున్నారు.
నివేదిక తర్వాతే తుది నిర్ణయం
నీట్ నిర్వహణలో సంస్కరణల కోసం ప్రముఖ టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఆ కమిటీ త్వరలో తన నివేదికను సమర్పించనుంది. ఆ నివేదికలోని మార్గదర్శకాలు, సూచనల ఆధారంగానే నీట్-యూజీ పరీక్షా విధానంలో తుది మార్పులు ఉంటాయని కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు తెలిపింది.
కమిటీ పనేంటి?
నీట్ పేపర్ లీకేజీ ఆరోపణలు దేశవ్యాప్తంగా తీవ్ర వివాదానికి దారితీయడంతో పరీక్షల నిర్వహణపై అనేక ప్రశ్నలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో నీట్‌తో పాటు జాతీయ స్థాయిలో నిర్వహించే ప్రవేశ పరీక్షల వ్యవస్థను సమూలంగా సంస్కరించాల్సిన అవసరం ఉందని కేంద్ర ప్రభుత్వం భావించింది. అందుకే నందన్ నీలేకణి నేతృత్వంలో ఉన్నతస్థాయి నిపుణుల టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి పరీక్షల నిర్వహణలో పారదర్శకత పెంచడం, ప్రశ్నాపత్రాల భద్రతను మరింత బలోపేతం చేయడం, సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగించడం, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) పనితీరును మెరుగుపరచడం వంటి అంశాలపై సమగ్ర సిఫార్సులు చేయాల్సిన బాధ్యతను అప్పగించింది. ఈ నేపథ్యంలోనే నీట్‌ను సీబీటీ విధానంలో నిర్వహించడంపై సాధ్యాసాధ్యాలను కూడా కమిటీ పరిశీలిస్తోంది. ఏటా 20 లక్షలమందికి పైగా రాసే ఈ పరీక్షను ఆన్లైన్లో నిర్వహించడం చాలా కష్టమైన పని. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు కంప్యూటర్లు అందుబాటులో లేకపోవడం, దేశవ్యాప్తంగా తగిన సంఖ్యలో పరీక్షా కేంద్రాల ఏర్పాటు వంటి అంశాలపై టాస్క్‌ఫోర్స్ అధ్యయనం చేస్తోంది.
ఎప్పటినుంచో కసరత్తు
సాధారణంగా నీట్‌ను ఒకే రోజు, ఒకే సెషన్లో దేశవ్యాప్తంగా నిర్వహించడం వల్ల ప్రశ్నాపత్రాల ముద్రణ, రవాణా, భద్రత వంటి ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తోంది. ముఖ్యంగా ప్రశ్నాపత్రాల ముద్రణ, పంపిణీ ప్రక్రియలోనే లీకేజీలకు అవకాశం కలుగుతున్నదని నిపుణులు అభిప్రాయపడటంతో సీబీటీ విధానంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ ఏడాది మేలో నీట్ పరీక్ష రద్దు అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో అప్పటి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తొలిసారిగా దీనిపై ప్రస్తావించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి నీట్‌ను సీబీటీ విధానంలో నిర్వహించే దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ప్రకటించారు. దీనివల్ల ప్రశ్నాపత్రాలను డిజిటల్ ఎన్క్రిప్షన్ ద్వారా చివరి క్షణంలో పరీక్షా కేంద్రాలకు పంపే అవకాశం ఉండటంతో లీకేజీ ప్రమాదం తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు.

