మాటల ప్రభుత్వం కాదు.. చేతల ప్రభుత్వం: పొంగులేటి

కలం, ఖమ్మం బ్యూరో: తమ ప్రభుత్వం మాటలకే పరిమితం కాదని, అభివృద్ధి పనులను చేసి చూపిస్తున్న చేతల ప్రభుత్వమని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి (Minister Ponguleti) తెలిపారు. ఏదులాపురం (Edulapuram) మున్సిపాలిటీ పరిధిలో గత 32 నెలల్లో రూ.21.61 కోట్లతో అభివృద్ధి పనులు పూర్తి చేసి ప్రగతి ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. గురువారం ఖమ్మం రూరల్ మండలం ఏదులాపురంలో జిల్లా కలెక్టర్ టీఎస్ దివాకర్, సీపీ సునీల్ దత్‌లతో కలిసి మంత్రి పర్యటించారు.

ఈ సందర్భంగా రూ.7.10 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు కీలక రహదారి నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. గుదిమల్ల వరకు రూ.5 కోట్లతో నిర్మించనున్న రహదారి, కామంచికల్ నుంచి కోయచలక వరకు రూ.2.10 కోట్లతో చేపట్టనున్న బీటీ రోడ్డు పనులకు భూమిపూజ నిర్వహించారు. అనంతరం మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం మౌలిక వసతుల కల్పనను నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను వేగంగా అమలు చేస్తోందని అన్నారు.

కుల, మత, రాజకీయ భేదాలు లేకుండా అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు అందిస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఇప్పటికే వివిధ విడతల్లో 8 లక్షల ఇళ్లను మంజూరు చేశామని తెలిపారు. అలాగే ఆగస్టు 15 నుంచి కొత్తగా వృద్ధాప్య, వితంతు పెన్షన్ల మంజూరు ప్రక్రియ ప్రారంభిస్తామని మంత్రి ప్రకటించారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>