కార్పొరేట్ జపం చేస్తున్న మోదీ: చాడ వెంకటరెడ్డి

కలం, కరీంనగర్ బ్యూరో: కార్పొరేట్ శక్తుల కనుసన్నల్లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పాలన కొనసాగిస్తోందని.. ప్రధాని మోదీ అదానీ,అంబానీల జపం చేస్తున్నారని సీపీఐ మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి (Chada Venkat Reddy) ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించడానికి పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రచార జాతను గురువారం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పద్మనగర్ వద్ద జెండా ఊపి ప్రారంభించారు

ఈ సందర్భంగా చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను తెలియజేసేందుకు ఈ నెల 14వరకు అన్ని మండలాల్లో ప్రచార జాత నిర్వహిస్తామన్నారు. ప్రజా సంక్షేమం, సుపరిపాలన అందిస్తామని వాగ్దానం చేసినా ఏ ఒక్కటి కూడా అమలు పరచడం లేదని ఆరోపించారు. నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రోల్,డీజిల్, వంట గ్యాస్ ధరల బారాన్ని ప్రజలపై వేస్తోందని, దేశంలో ద్రవ్యోల్బణం కూడా ప్రజలపై మోయలేని భారంగా మారుతుందన్నారు.

మహిళా రిజర్వేషన్ అమలు చేయాలి..

రైతులకు వ్యతిరేకంగా చట్టాలు తీసుకొస్తే దేశవ్యాప్తంగా రైతులు తీవ్ర ఆందోళన నిర్వహించారని చాడ వెంకట్ రెడ్డి అన్నారు. ఆందోళన కార్యక్రమాల్లో 750 మందికి పైగా రైతులు మృతి చెందారని గుర్తు చేశారు. రైతులకు కనీస మద్దతు ధర చట్టం తెస్తామని హామీ ఇచ్చి ఇప్పటివరకు అమలు చేయకపోవడం దారుణమన్నారు. మహిళా రిజర్వేషన్ తక్షణమే అమలు చేయాలని, ధరల పెరుగుదలను నియంత్రించాలన్నారు.

దళిత, ఆదివాసీలపై రోజురోజుకు దాడులు పెరిగిపోతున్నాయని, డబ్బున్నవారే ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా గెలుపొందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంద్రజిత్ గుప్తా హోం మంత్రిగా ఉన్నప్పుడు అభ్యర్థుల ఎన్నికల ఖర్చులు ప్రభుత్వమే భరించాలని ఓ కమిటీ వేశారన్నారు. అది అమలు చేయకపోవడం వలనే అనేకమంది పెట్టుబడిదారులు అధికారాన్ని చేయించుకుంటున్నారని అన్నారు.

ఢిల్లీలో భారీ ఆందోళన..

సెప్టెంబర్ ఒకటో తేదీన ఢిల్లీ నడిబొడ్డున బీజేపీ పాలనను నిరసిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తున్నట్లు ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు ఢిల్లీకి తరలి రావాలని చాడ వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. అర్హులైన ప్రతీ నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలకు పింఛన్లు లేక ఎదురు చూస్తున్నారని వివరించారు.

ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పొనగంటి కేదారి, అందె స్వామి, నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి, జిల్లా కార్యవర్గ, కౌన్సిల్ సభ్యులు బోయిని అశోక్, గూడెం లక్ష్మి, టేకుమల్ల సమ్మయ్య, నాగెల్లి లక్ష్మారెడ్డి, పైడిపల్లి రాజు, కటికరెడ్డి బుచ్చన్న యాదవ్, బీర్ల పద్మ, కొట్టె అంజలి, ఉమ్మెంతల రవీందర్ రెడ్డి, మచ్చ రమేష్, బామండ్లపెల్లి యుగేందర్ పలువురు నాయకులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>