కలం, నిర్మల్: నిర్మల్ జిల్లా కలెక్టర్ (Nirmal Collector) భవేశ్ మిశ్రా ప్రభుత్వ విద్యాసంస్థల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీలు, గురుకుల పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేస్తూ విద్యార్థులతో నేరుగా మమేకమవుతున్నారు. తరగతి గదుల్లోకి వెళ్లి స్వయంగా పాఠాలు బోధిస్తూ, ప్రశ్నలు అడిగి సరైన సమాధానాలు చెప్పిన విద్యార్థులకు పెన్నులను బహుమతిగా అందిస్తూ వారిలో చదువుపై ఆసక్తి, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తున్నారు. అలాగే జిల్లా అధికారులకు కూడా పాఠశాలలు, వసతి గృహాలను నిరంతరం తనిఖీ చేస్తూ విద్యార్థులను ప్రోత్సహించాలని సూచిస్తున్నారు.
గురువారం రాత్రి సారంగాపూర్ మండలం జామ్ గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కేజీబీవీ పరిసరాలను పరిశీలించారు. ప్రతిరోజు పాఠశాల ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. విద్యార్థులందరికీ మెనూ ప్రకారం నాణ్యమైన, రుచికరమైన భోజనాన్ని అందించాలన్నారు. పదవ తరగతి విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడారు. ఇంగ్లీషు సబ్జెక్టులో పూర్తయిన పాఠానికి సంబంధించి విద్యార్థులకు పరీక్షను నిర్వహించారు. విద్యార్థులకు పెన్నులను బహుమతులుగా అందించారు. చక్కగా చదువుకుని జిల్లాకు, పాఠశాలకు, ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. కలెక్టర్ వెంట విద్యాశాఖ అధికారి భోజన్న, తహసీల్దార్ విజయకాంత్, ఎంపీడీవో లక్ష్మీ కాంతారావు, ఎంపీఓ అజీజ్ ఖాన్, సర్పంచ్ కరిపే రవళి విలాస్ పాల్గొన్నారు.

