కలం, హనుమకొండ: ఉమ్మడి వరంగల్ (Warangal) జిల్లాలో నకిలీ వైద్యుల (Fake Doctors)పై తెలంగాణ మెడికల్ కౌన్సిల్ (టీజీఎంసీ) ప్రత్యేక దాడులు నిర్వహించింది. వైద్య అర్హతలు లేకుండా వైద్యం చేస్తున్న వారిపై ఉక్కుపాదం మోపుతూ 16 మంది నకిలీ వైద్యులపై కేసులు నమోదు చేసింది. దాడుల్లో కొందరు ఇతర వైద్యుల రిజిస్ట్రేషన్ నంబర్లను దుర్వినియోగం చేస్తున్నట్లు గుర్తించిన టీజీఎంసీ, ఈ వ్యవహారంలో డా. శ్రీహితకు షోకాజ్ నోటీసు జారీ చేసింది.
మరోవైపు ప్రధాన నిందితుడిగా భావిస్తున్న రుద్ర భాస్కర్ పరారీలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. నకిలీ వైద్యులపై చర్యలు కొనసాగుతాయని, అర్హతలు లేకుండా వైద్యం చేసే వారిని ఉపేక్షించబోమని టీజీఎంసీ స్పష్టం చేసింది. ప్రజలు వైద్యం చేయించుకునే ముందు సంబంధిత వైద్యుడి అర్హతలు, రిజిస్ట్రేషన్ వివరాలు తప్పనిసరిగా పరిశీలించాలని అధికారులు సూచించారు.

