కలం, వెబ్‌డెస్క్: ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు (Benjamin Netanyahu) ఇరాన్‌కు హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్ అణు ఆయుధాలు సాధించకుండా అడ్డుకునేందుకు సైనిక చర్యకు వెనుకాడబోమన్నారు. తాజాగా ఇరాన్ కు రాసిన లేఖలో నెతన్యాహు ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరాన్, అమెరికా మధ్య జరుగుతున్న శాంతి చర్చలు చివరి దశకు చేరుకున్న తరుణంలో నెతన్యాహు వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇరాన్ ఆర్జీసీ కమాండర్ అహ్మద్ వహిది అణు ఆయుధ తయారీని కొనసాగిస్తామని చేసిన ప్రకటనపై నెతన్యాహు స్పందించారు. అమెరికా తమకు గొప్ప మిత్ర దేశమే అయినప్పటికీ, ఇజ్రాయెల్ భద్రతను కాపాడుకోవడానికి అవసరమైన ఎలాంటి చర్యలకైనా తాను వెనుకాడబోనని స్పష్టం చేశారు.
మరోవైపు ఖతార్ విదేశాంగ మంత్రిత్వ శాఖ మధ్యవర్తిత్వంలో అమెరికా, ఇరాన్‌ల మధ్య చర్చలు ముమ్మరంగా సాగుతున్నాయని ఖతార్ ప్రతినిధి తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్‌పై యుద్ధం ప్రారంభించాయి. ఈ దాడుల్లో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. జూన్‌లో ఖతార్, పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో ఇరు దేశాల మధ్య ఒప్పందాలు కుదిరాయి. హుర్ముజ్ జలసంధిలో నావిగేషన్ స్వేచ్ఛ వంటి అంశాలపై భేదాభిప్రాయాలతో చర్చలు నిలిచిపోయాయి. జూలై నెలలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మళ్లీ తారాస్థాయికి చేరుకున్నాయి.

