కలం, మహబూబ్‌నగర్ బ్యూరో: జిల్లాలోని మహబూబ్‌నగర్ నగరపాలక సంస్థతో పాటు జడ్చర్ల, దేవరకద్ర, భూత్పూర్ మున్సిపాలిటీల పరిధిలో TUFIDC, UFC నిధులతో చేపడుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ (Mahabubnagar Collector) ఖుష్బూ గుప్తా (Khushboo Gupta) మున్సిపల్ కమిషనర్‌లను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలోని తన ఛాంబర్‌లో మహబూబ్‌నగర్ నగరపాలక సంస్థ, మూడు మున్సిపాలిటీల కమిషనర్‌లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో అభివృద్ధి పనుల పురోగతిని కలెక్టర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి మున్సిపాలిటీలో వ్యర్థాల శుద్ధి ప్లాంట్ల ఏర్పాటు, లెగసీ వ్యర్థాల తొలగింపునకు చేపడుతున్న బయో మైనింగ్ పనులు, ప్రజా మరుగుదొడ్ల నిర్మాణం, నిర్వహణ, తాగునీటి సరఫరా అభివృద్ధి పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. TUFIDC, UFC నిధులతో చేపడుతున్న అన్ని అభివృద్ధి పనులను వెంటనే ప్రారంభించి, ఎలాంటి జాప్యం లేకుండా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తూ ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.
మున్సిపాలిటీలలో పారిశుధ్యం, తాగునీరు, ఇతర ప్రాథమిక వసతుల మెరుగుదలకు ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్, మహబూబ్‌నగర్ మున్సిపల్ కమిషనర్ రామానుజుల రెడ్డి, జడ్చర్ల మున్సిపల్ కమిషనర్ గిరీష్, దేవరకద్ర మున్సిపల్ కమిషనర్ నరేష్, భూత్పూర్ మున్సిపల్ కమిషనర్ పవన్ కుమార్ పాల్గొన్నారు.

