తెలంగాణ హక్కులను కేంద్రం, ఏపీ కాలరాస్తున్నాయి: హరీశ్ రావు

కలం, వెబ్ డెస్క్: తెలంగాణ నీటి ప్రయోజనాలను ఏపీకి తాకట్టు పెడుతున్నారా? అంటూ రేవంత్ సర్కార్‌పై బీఆర్ఎస్ (BRS) మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ మేరకు తెలంగాణ భవన్ లో బుధవారం మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. నీటివాటాలపై రేవంత్ రెడ్డికి సోయి లేదా ? అని ఫైర్ అయ్యారు. ఏపీ సీఎం చంద్రబాబు అంటే రేవంత్ రెడ్డికి భయమా? అని సందేహం వ్యక్తం చేశారు. గురుదక్షణ చెల్లించేందుకే రేవంత్ రెడ్డి మౌనం పాటిస్తున్నారా? అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు సహా 7 ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేయాలని ఏపీ ప్రతిపాదిస్తే.. జీఆర్ఎంబీ ఎజెండాలో పెట్టడాన్నిఆయన తీవ్రంగా తప్పుబట్టారు. తమ హయాంలో కేసీఆర్ తెచ్చిన అనుమతులను సమీక్షించాలని గోదావరి నది మేనేజ్‌మెంట్ బోర్డు (GRMB) సమావేశంలో చేర్చారని అన్నారు.

తెలంగాణకు నష్టం జరుగుతోంది..

తెలంగాణ ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేయాలన్న ఏపీ ప్రతిపాదనపై హరీశ్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జీఆర్ఎంబీ 18వ సమావేశం అధికారిక ఎజెండాలోని 18.3.6 అంశంలో తెలంగాణకు తీవ్ర నష్టం చేసే ప్రతిపాదన ఉందన్నారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత నిర్మించిన కాలేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ (240 టీఎంసీలు), చౌట్‌పల్లి హన్మంత్‌రెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ (0.8 టీఎంసీలు), చిన్న కాళేశ్వరం (4.5 టీఎంసీలు), చానక–కోరట ప్రాజెక్ట్ (1.2 టీఎంసీలు), మోడికుంట వాగు ప్రాజెక్ట్ (2.047 టీఎంసీలు), కడం గూడెం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ (3 టీఎంసీలు), ఇంటిగ్రేటెడ్ సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ (67.5 టీఎంసీలు)లకు 2018–2025 మధ్య టీఏసీ అనుమతులు లభించాయన్నారు.

ఏపీ అడిగితే రద్దు చేస్తారా?

ఏడు ప్రాజెక్టులకు వచ్చిన అనుమతులను రద్దు చేయాలని ఏపీ అడిగితే ఎలా రద్దు చేస్తారని హరీశ్ ప్రశ్నించారు. ఒక తెలంగాణ ఉద్యమకారునిగా తనకే గుండె రగిలిపోతుందని అన్నారు. రేవంత్ ప్రభుత్వ హయాంలో ఒక్క సాగునీటి ప్రాజెక్టుకు అనుమతి తేలేదని మండిపడ్డారు. కేంద్రం, ఏపీ కలిసి తెలంగాణ హక్కులు కాలరాస్తున్నాయని ఆరోపించారు. దీనిపై కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ స్పందించాలన్నారు. ఆంధ్ర ప్రదేశ్ కోసమే జీఆర్ఎంబీ ఉందన్న హరీశ్.. రాజ్యాంగ పరమైన హక్కులు తెలంగాణకు లేవా అని మండిపడ్డారు.

తెలంగాణ ఇంజనీర్లు ఏం చేస్తున్నారు?

తెలంగాణ ప్రజల నీటి హక్కులకు సంబంధించిన ఇంతటి కీలకమైన అంశం ఎజెండాలోకి వస్తుంటే.. జీఆర్ఎంబీలో ఉన్న తెలంగాణ ఇంజనీర్లు ఏం చేస్తున్నారు? అని ప్రశ్నించారు. వారు ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయలేదా? ఒకవేళ తెలియజేస్తే.. సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు స్పందించలేదు? అని నిలదీశారు. తెలంగాణ ప్రయోజనాలను కాపాడాల్సిన ప్రభుత్వం ఎందుకు మౌనం వహిస్తోంది? అని ఫైర్ అయ్యారు. ఇప్పటివరకు తెలంగాణకు ఒక్క కొత్త ప్రాజెక్టుకూ కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతి తీసుకురాలేకపోయిందని దుయ్యబట్టారు. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం సాధించిన ప్రాజెక్టుల అనుమతులనే రద్దు చేసే పరిస్థితి రావడం అత్యంత దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రజలు సహించరు..

తెలంగాణకు చెందిన ప్రతి నీటి చుక్క, ప్రతి ప్రాజెక్టు, ప్రతి హక్కును కాపాడటం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అని సూచించారు. అలాంటి సమయంలో నిర్లక్ష్యం, మౌనంగా ఉంటడం ప్రజల్లో తీవ్రమైన అనుమానాలకు తావిస్తోందని అన్నారు. తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టే ప్రయత్నాలు ఏ రూపంలో వచ్చినా ప్రజలు సహించరని హెచ్చరించారు. రైతుల ప్రయోజనాలను కాపాడటంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని దుయ్యబట్టారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>