కలం, వనపర్తి: జిల్లా కేంద్రంలోని ఐడీఓసీ కార్యాలయ ఆవరణలో సొసైటీ ఫర్ రూరల్ డెవలప్ మెంట్ సర్వీసెస్ (SRDS Employees) పరిధిలో నిర్ణీత-కాల ఉద్యోగులు (FTEs) గా పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు చేపట్టిన పెన్‌డౌన్ నిరసన బుధవారం ఐదో రోజుకు చేరుకుంది. పెండింగ్ వేతనాల విడుదల, పే స్కేల్ అమలు తదితర డిమాండ్ల సాధన కోసం రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు నిరసన చేపట్టారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని ఉద్యోగులు కోరారు.
ఉద్యోగుల డిమాండ్లలో 2026 ఆగస్టు 15లోపు పే స్కేల్ అమలు చేసి ఉత్తర్వులు జారీ చేయడం, ప్రతి నెల మొదటి తేదీన వేతనాలు చెల్లించడం, పెండింగ్‌లో ఉన్న మూడు నెలల వేతనాలను వెంటనే విడుదల చేయడం, సొసైటీ ఫర్ రూరల్ డెవలప్మెంట్ సర్వీసెస్ బోర్డు ఆమోదించిన నిర్ణయాలను అమలు చేయడం, సెలవు దినాల్లో విధులు నిర్వహించే ఉద్యోగులకు తగిన ప్రయోజనాలు కల్పించడం, ఫైనాన్స్–హెచ్‌ఆర్ విభాగాల మధ్య సమన్వయం పెంచి వేతనాల జాప్యాన్ని నివారించడం, క్యాడర్ స్ట్రెంత్ ఖరారు చేసి పదోన్నతులు, బదిలీలు, కెరీర్ అడ్వాన్స్‌మెంట్ పాలసీ అమలు చేయాలని పలు డిమాండ్లను నెరవేర్చాలని కోరారు.
ఆగస్టు 15లోగా సమస్యలు పరిష్కరించకపోతే ఆగస్టు 16 నుంచి రాష్ట్రవ్యాప్తంగా దశలవారీ ఆందోళనలు, నిరసనలు, అవసరమైతే సమ్మె చేపడతామని ఉద్యోగులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జేఏసీ కన్వీనర్ బాలయ్య, కో-కన్వీనర్ కోళ్ల సత్తన్న, సీహెచ్ భాస్కర్, తిరుపతయ్యతో పాటు అన్ని మండలాల ఏపీవోలు, టీఎస్ లు, బీఎఫ్టీలు, సిఓఎస్ లు, ఈసిఎస్ లు పాల్గొన్నారు.

