కలం, క్రైమ్ బ్యూరో: హైదరాబాద్లో కల్తీ మసాలా దినుసుల తయారీ, సరఫరా చేస్తున్న ముఠాను హెచ్-ఫాస్ట్ (H-FAST) అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నగరంలోని 13 మసాలా వ్యాపార, ప్రాసెసింగ్ సంస్థలపై మెరుపు దాడులు నిర్వహించి 25.3 టన్నుల కల్తీ మసాలా దినుసులు, 89.15 టన్నుల ముడి పదార్థాలను సీజ్ చేశారు. ఈ వ్యవహారంలో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకొని.. మూడు క్రిమినల్ కేసులు నమోదు చేసినట్టు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ వెల్లడించారు. మంగళవారం హెచ్-ఫాస్ట్ బృందం, జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి నగరంలోని పలు ప్రాంతాల్లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించింది.
మైలార్దేవ్పల్లి, బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 13 మసాలా వ్యాపార, ప్రాసెసింగ్ సంస్థల్లో సోదాలు నిర్వహించి భారీగా కల్తీ మసాలాలు, ముడి పదార్థాలను స్వాధీనం చేసుకుంది. ఈ ముఠా ప్రమాదకర రసాయనాలతో తయారు చేసిన మసాలా దినుసులను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాలకు సరఫరా చేస్తున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైందని సజ్జనార్ తెలిపారు.
ఆకర్షణీయమైన రంగులు
–వాము, జీలకర్ర, లవంగం, షాజీరా, ఆవాలు తదితర మసాలా దినుసులను కల్తీ చేసినట్లు అధికారులు గుర్తించారు.
–మసాలాలకు ఆకర్షణీయమైన రంగు, మెరుపు తీసుకురావడానికి ఫ్యాబ్రిక్ డైలు, సింథటిక్ ఆరెంజ్, రెడ్, గ్రీన్ ఫుడ్ కలర్స్, ఇండస్ట్రియల్ డైలు, టాల్కమ్ పౌడర్, రైస్ బ్రాన్ ఆయిల్ వినియోగిస్తున్నట్లు వెల్లడించారు.
–రసాయన పదార్థాలు వినియోగించి తయారు చేసిన మసాలా దినుసులను నాణ్యమైన మసాలాలుగా మార్కెట్లో విక్రయిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. స్వాధీనం చేసుకున్న మసాలా దినుసుల నమూనాలను ప్రయోగశాల పరీక్షలకు పంపినట్లు సజ్జనార్ తెలిపారు. ఆహార భద్రత చట్టం కింద మరిన్ని కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ కేసును సమగ్రంగా దర్యాప్తు చేసి మొత్తం నెట్వర్క్ను వెలికితీసేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.
మూత్రపిండాలకు ప్రమాదం
కల్తీ మసాలాల వినియోగం వల్ల కాలేయం, మూత్రపిండాలకు తీవ్ర నష్టం కలిగే ప్రమాదం ఉందని సీపీ హెచ్చరించారు. దీర్ఘకాలంగా ఇలాంటి మసాలాలు వాడితే క్యాన్సర్, అలర్జీలు, జీర్ణ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉందన్నారు. ప్రజలు నాణ్యత లేని లేదా అనుమానాస్పద ఆహార పదార్థాలపై వెంటనే పోలీసులకు, ఫుడ్ సేఫ్టీ అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. హెచ్-ఫాస్ట్ ఏర్పాటు చేసిన గత 140 రోజుల్లో నగరంలోని 659 ప్రాంతాల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించినట్లు సజ్జనార్ తెలిపారు. ఈ కాలంలో మొత్తం 202 కేసులు నమోదు చేసి 246 టన్నుల కల్తీ ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే వారిపై కఠిన చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.

