కలం, స్పోర్ట్స్ : టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీ (Mohammed Shami) టెస్ట్ జట్టులోకి తిరిగి రావడం మరింత కష్టంగా మారినట్లు కనిపిస్తోంది. జస్ప్రీత్ బుమ్రా గాయంతో శ్రీలంకతో జరిగే రెండు టెస్టుల సిరీస్‌కు దూరం కావడంతో, అతడి స్థానంలో షమీని కాకుండా ఆకిబ్ నబీని బీసీసీఐ ఎంపిక చేసింది. ఈ నిర్ణయంతో షమీ భవిష్యత్‌పై మరోసారి చర్చ మొదలైంది. షమీ చివరిసారిగా 2025లో ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో భారత్ తరఫున ఆడాడు. టెస్టుల్లో అయితే 2023 తర్వాత అతడికి అవకాశం రాలేదు.
ఫిట్నెస్ సమస్యలతో జట్టుకు దూరమైన షమీ, గత ఏడాదిగా దేశవాళీ క్రికెట్లో మంచి ప్రదర్శన చేస్తున్నా జాతీయ జట్టులోకి తిరిగి చోటు సంపాదించలేకపోయాడు. షమీ పునరాగమనంపై ప్రశ్నించగా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ స్పందించారు. ప్రస్తుతం షమీకి టెస్ట్ క్రికెట్ ఆడేందుకు అవసరమైన ఫిట్నెస్ లేదని ఆయన చెప్పినట్లు సమాచారం. అయితే రంజీ ట్రోఫీలో షమీ ప్రదర్శన ఆకట్టుకునేలా ఉంది. చివరి ఏడు మ్యాచ్‌ల్లో 37 వికెట్లు పడగొట్టాడు.
మూడు సార్లు ఐదు వికెట్ల ఘనత సాధించాడు. మరోవైపు ఆకిబ్ నబీ అదే సీజన్లో 60 వికెట్లు తీసి సెలెక్టర్లను మెప్పించాడు. దీంతో శ్రీలంక టెస్ట్ సిరీస్‌కు అవకాశం అతడికే దక్కింది. ఈ పరిణామాలతో షమీ మళ్లీ టెస్ట్ జట్టులోకి రావాలంటే పూర్తి ఫిట్నెస్ నిరూపించుకోవడంతో పాటు దేశవాళీ క్రికెట్లో యువ పేసర్ల కంటే మెరుగైన ప్రదర్శన కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

