కలం, యాదగిరిగుట్ట : యాదాద్రి భువనగిరి (Yadadri Bhuvanagiri )జిల్లా కలెక్టర్ కార్యాలయంలో షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖకార్యకలాపాలపై అదనపు కలెక్టర్ భాస్కర్ రావు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రధానంగా శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రభుత్వ వసతి గృహాల నిర్వహణ, విద్యార్థుల సంక్షేమం, పరిశుభ్రత, భద్రత తదితర అంశాలపై సమీక్షించారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, హాస్టల్ వెల్ఫేర్ అధికారులు విధులకు తప్పనిసరిగా హాజరు కావాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో విధులకు గైర్హాజరు కావాల్సి వచ్చినట్లయితే సంబంధిత ఉన్నతాధికారులకు ముందస్తుగా సమాచారం అందించి, అనుమతి పొందిన తర్వాత మాత్రమే విధులకు గైర్హాజరు కావాలని ఆదేశించారు.
వర్షాకాలం కొనసాగుతున్నందున విద్యార్థులకు ఎల్లప్పుడూ తాజాగా వండిన వేడి ఆహారాన్ని మాత్రమే అందించాలని, ఉదయం వండిన ఆహారాన్ని సాయంత్రం వరకు నిల్వ ఉంచకుండా ఎప్పటికప్పుడు వండి అందించాలని సూచించారు. హాస్టల్ వంటశాలలు, భోజనశాలలు మరియు పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచి పారిశుద్ధ్య ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలని తెలిపారు. విద్యార్థుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, వర్షాకాలంలో చెరువులు, కుంటలు, కాలువలు వంటి నీటి వనరుల వద్దకు విద్యార్థులు వెళ్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.
జిల్లాలో ప్రతి హాస్టల్‌కు ప్రత్యేక అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నందున హాస్టల్ వెల్ఫేర్ అధికారులు తమ విధులను నిబంధనలకు అనుగుణంగా సమర్థవంతంగా నిర్వహిస్తూ, అవసరమైన రికార్డులను సిద్ధంగా ఉంచాలని సూచించారు. ఈ సమీక్ష సమావేశంలో ఇంచార్జి జిల్లా షెడ్యూల్డ్ కులముల అభివృద్ధి అధికారి జి. సురేష్, సహాయ షెడ్యూల్డ్ కులముల అభివృద్ధి అధికారులు సుమంత్,బిక్షం , జిల్లా షెడ్యూల్డ్ కులముల అభివృద్ధి కార్యాలయ సూపరింటెండెంట్ జోతిర్మయి జిల్లాలోని హాస్టల్ వెల్ఫేర్ అధికారులు, పాల్గొన్నారు.

