యూత్ డిక్లరేషన్ నిరుద్యోగుల పాలిట మరణ శాసనం: ఏనుగుల రాకేష్ రెడ్డి

కలం, ఖమ్మం బ్యూరో : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి నిరుద్యోగులను మోసం చేస్తోందని, ఎన్నికల ముందు ప్రకటించిన ‘యూత్ డిక్లరేషన్’ ఇప్పుడు నిరుపయోగంగా మారి వారి పాలిట మరణ శాసనంగా పరిణమించిందని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేష్ రెడ్డి (Rakesh Reddy) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మంగళవారం ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

​మధిర నియోజకవర్గానికి చెందిన నిరుద్యోగి గడ్డం వేణు గౌడ్ ఏళ్ల తరబడి శ్రమిస్తున్నా ఉద్యోగం రాక తీవ్ర మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేయడం అత్యంత విచారకరమని రాకేష్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వేణు రాసిన సూసైడ్ నోట్ తెలంగాణలోని లక్షలాది మంది నిరుద్యోగుల ఆక్రోశానికి నిదర్శనమని, ఆ నిజాలను తొక్కిపెట్టి ప్రేమ వ్యవహారంగా చిత్రీకరించేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని మండిపడ్డారు.

​ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఆయన పలు డిమాండ్లు చేశారు. చికిత్స పొందుతున్న వేణు గౌడ్‌కు హైదరాబాద్‌లో అత్యుత్తమ వైద్యం అందించాలని, ఆయన కుటుంబానికి తక్షణ సాయంగా రూ.5 లక్షలతో పాటు పక్కా ఇల్లు మంజూరు చేయాలని కోరారు. అలాగే ఉద్యోగ ఖాళీలను 7,000 నుండి 19,000 పోస్టులకు పెంచుతూ నోటిఫికేషన్ సవరించాలని, కానిస్టేబుల్, ఎస్ఐ అభ్యర్థులకు వయోపరిమితి సడలించి, ఇచ్చిన హామీ ప్రకారం తక్షణమే స్పష్టమైన జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేయాలని స్పష్టం చేశారు. నిరుద్యోగుల ఆగ్రహమే కాంగ్రెస్ ప్రభుత్వ పతనానికి దారితీస్తుందని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో గూడా సంజీవ్ రెడ్డి, బలుసు మురళీకృష్ణ, మద్దెల విజయ కుమార్ తదితర బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>