మహిళా బాక్సర్లకు ప్రాధాన్యం ఇవ్వండి: అఖిల్ కుమార్

కలం, స్పోర్ట్స్: 2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌లో మన మహిళా బాక్సర్లే పతకాలు కొల్లగొట్టబోతున్నారని మాజీ స్టార్ బాక్సర్, హర్యానా ఏసీపీ అఖిల్ కుమార్ (Akhil Kumar) స్పష్టం చేశారు. పురుషుల కంటే మహిళలకే మెడల్స్ సాధించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని.. అందుకే ఒలింపిక్స్ ప్రణాళికల్లో మహిళా బాక్సర్లకే మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఇటీవల ముగిసిన కామన్వెల్త్ గేమ్స్‌లో భారత బాక్సర్లు చారిత్రాత్మక విజయాన్ని సాధించారని ప్రశంసించారు.

ఆరు పతకాలు మహిళలవే..

భారత్ గెలుచుకున్న ఏడు స్వర్ణ పతకాల్లో ఏకంగా ఆరు పతకాలు మహిళలే కైవసం చేసుకున్నారని అఖిల్ కుమార్ వివరించారు. మహిళా బాక్సర్లు అత్యుత్తమ ఫలితాలతో దూసుకుపోతున్నారని కొనియాడారు. ప్రస్తుత పురుష బాక్సర్లలో ఒలింపిక్ పతకం సాధించే స్థాయి ఎవరికీ లేదని ఆయన నిర్మోహమాటంగా చెప్పారు. భవిష్యత్తులో వారు ఆటతీరు మార్చుకుంటే తన అభిప్రాయం మార్చుకుంటానని తెలిపారు. కాగా, ఈ కామన్వెల్త్ టోర్నీలో మహిళలు ఏడు విభాగాల్లో పోటీపడి ఆరు స్వర్ణాలు, ఒక రజతం సాధించిన విషయం తెలిసిందే.

సీడింగ్ విధానం వద్దు..

పురుషులు మాత్రం రెండు స్వర్ణాలు, ఒక రజతంతో సరిపెట్టుకున్నారని అఖిల్ కుమార్ అన్నారు. రింగ్‌లో అద్భుత ప్రతిభ చూపిన జైస్మిన్ లంబోరియా, సాక్షి చౌదరి, జడుమని సింగ్‌‌ను ప్రత్యేకంగా అభినందించారు. బాక్సింగ్ రంగానికి నీరజ్ చోప్రా, మను భాకర్ లాంటి ఐకాన్లు అత్యవసరమని అభిప్రాయపడ్డారు. యువతను ప్రేరేపించే హీరోలు బాక్సింగ్‌లో రావాలని కోరారు. ఇక బాక్సర్ల ఎంపిక విషయంలో సీడింగ్ విధానాన్ని తప్పుబట్టిన ఆయన, కేవలం మైదానంలో ప్రతిభ ఆధారంగానే (ట్రయల్స్) ఎంపికలు జరగాలని స్పష్టం చేశారు. సరైన ప్రాధాన్యం, సరైన శిక్షణ ఇస్తే 2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌లో భారత మహిళా బాక్సర్లు సరికొత్త చరిత్ర సృష్టించడం ఖాయంగా కనిపిస్తోందన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>