కలం, నిర్మల్: నిర్మల్ జిల్లా కేంద్రంలో కొద్దిరోజులుగా రహదారులపై విచ్చలవిడిగా సంచరిస్తున్న ఆవులు, ఎద్దుల కారణంగా ట్రాఫిక్‌కి అంతరాయం కలుగుతోంది. ఫలితంగా ప్రమాదాల ముప్పు పెరుగుతున్న నేపథ్యంలో మున్సిపల్ అధికారులు (Nirmal Municipality) మంగళవారం ప్రత్యేక చర్యలు చేపట్టారు. పట్టణంలోని పలు ప్రధాన కూడళ్లలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి రోడ్లపై తిరుగుతున్న పశువులను పట్టుకుని మున్సిపల్ కార్యాలయానికి తరలించారు.
స్థానిక బైల్ బజార్, డాక్టర్స్ లైన్స్, వివేక్ చౌక్, జయశంకర్ చౌరస్తా, శివాజీ చౌక్, ఖానాపూర్ రోడ్డుతో పాటు రద్దీ ప్రాంతాల్లో సంచరిస్తున్న ఆవులు, ఎద్దులను పట్టుకున్నారు. అనంతరం ఆయా పశువుల యజమానులను గుర్తించి అపరాధ రుసుము విధించారు.
ఈ సందర్భంగా శానిటరీ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ మాట్లాడారు. రోడ్లపై పశువులను వదలొద్దని ఇప్పటికే నాలుగు సార్లు యజమానులను హెచ్చరించినప్పటికీ స్పందన లేకపోవడంతో ప్రత్యేక డ్రైవ్ చేపట్టినట్లు పేర్కొన్నారు. ఇకపై పశువులను రహదారులపై వదిలేస్తే భారీ మొత్తంలో జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు.

