ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలి: కలెక్టర్

కలం, నారాయణపేట: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని నారాయణపేట జిల్లా కలెక్టర్ ప్రియాంక (Narayanpet Collector) లబ్ధిదారులకు సూచించారు. దశలవారీగా ఇంటి నిర్మాణ పనులు పూర్తి చేస్తే బిల్లులు కూడా త్వరగా మంజూరవుతాయని ఆమె తెలిపారు. మంగళవారం మద్దూరు (మండలం) మున్సిపాలిటీ పరిధిలోని భీంపూర్ గ్రామంలో రూఫ్, స్లాబ్ స్థాయిలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లతో పాటు గృహప్రవేశం పూర్తయిన మరో ఇంటిని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. గ్రామానికి మంజూరైన ఇండ్ల వివరాలను హౌసింగ్ పీడీ శంకర్ నాయక్‌ను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం రూఫ్ స్థాయిలో ఉన్న ఇంటి లబ్ధిదారురాలు, స్లాబ్ స్థాయిలో ఉన్న ఇంటి లబ్ధిదారురాలితో మాట్లాడి నిర్మాణ పురోగతిని తెలుసుకున్నారు. ఇప్పటివరకు ఇంటి నిర్మాణానికి ఎంత ఖర్చు అయింది, ఎన్ని లక్షల రూపాయల బిల్లులు అందాయి, మిగిలిన పనులను ఎప్పటిలోగా పూర్తి చేస్తారనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. సెప్టెంబర్ నెలాఖరులోగా ఇండ్ల నిర్మాణాలను పూర్తి చేసి గృహప్రవేశాలు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు.

గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను సందర్శించిన కలెక్టర్ మధ్యాహ్న భోజన మెనూ, వంటగదిని పరిశీలించారు. పాఠశాలలో మొత్తం 50 మంది విద్యార్థులు ఉండగా, ఇద్దరు ఉపాధ్యాయులు మాత్రమే ఉన్నట్లు తెలుసుకున్నారు. వారిలో ఒకరు భీంపూర్ పాఠశాలకు రాకుండా గతంలో విధులు నిర్వహించిన పాఠశాలకే వెళ్తున్నారని తెలుసుకున్న కలెక్టర్, వెంటనే జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) గోవిందరాజుకు ఫోన్ చేసి సంబంధిత ఉపాధ్యాయుడిని తక్షణమే భీంపూర్ పాఠశాలకు పంపించాలని ఆదేశించారు. అదేవిధంగా, పాఠశాలలో అదనపు గది నిర్మాణం అసంపూర్తిగా ఉండటంతో పాటు భవనం ఫ్లోరింగ్ పనులను కూడా త్వరితగతిన పూర్తి చేయించాలని డీఈఓకు సూచించారు.ఈ కార్యక్రమంలో మద్దూరు మున్సిపల్ చైర్‌పర్సన్ సరస్వతి, కమిషనర్ శ్రీకాంత్, తహసీల్దార్ మహేష్, హౌసింగ్ ఏఈ, పంచాయతీ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.

తహసీల్దార్ కార్యాలయంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

నారాయణపేట జిల్లా దామరగిద్ద తహశీల్దార్ తహసీల్దార్ కలెక్టర్ ప్రియాంక మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయంలో తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్ (డీటీ) ఇద్దరూ లేకపోవడంతో వారు ఎక్కడికి వెళ్లారని సీనియర్ అసిస్టెంట్‌ను ప్రశ్నించారు. వారు ఫీల్డ్ విజిట్‌కు వెళ్లినట్లు సీనియర్ అసిస్టెంట్ వివరించారు. అనంతరం రిజిస్ట్రేషన్ విభాగాన్ని పరిశీలించిన కలెక్టర్, రోజుకు ఎన్ని రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి, మంగళవారం ఎన్ని రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయనే వివరాలను అడిగి తెలుసుకున్నారు.

అయితే కార్యాలయ ఆవరణలో ఓ మూలన ఫైళ్లను మూటకట్టి ఉంచడంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫైళ్లను ప్రత్యేక గదిలో భద్రంగా భద్రపరచకుండా ఇలా నిర్లక్ష్యంగా ఎందుకు ఉంచారని సీనియర్ అసిస్టెంట్‌ను ప్రశ్నించారు. తదనంతరం పక్కనే ఉన్న ఎంపీడీవో కార్యాలయాన్ని కూడా కలెక్టర్ తనిఖీ చేశారు. ఆ తర్వాత దామరగిద్ద తండాలో శిథిలావస్థకు చేరిన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల భవనాన్ని, ప్రస్తుతం అద్దె భవనంలో కొనసాగుతున్న పాఠశాలను సందర్శించారు. పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయుల సంఖ్యపై ఆరా తీశారు. ఈ సందర్భంగా తండాకు నూతన పాఠశాల భవనాన్ని మంజూరు చేయాలని సర్పంచ్ శరణ్ నాయక్ కలెక్టర్‌ను కోరారు. దీనిపై స్పందించిన కలెక్టర్, విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్నందున తండా విద్యార్థులను దామరగిద్ద మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు పంపే అవకాశాన్ని పరిశీలించాలని సూచించారు. అయితే మండల కేంద్రంలోని పాఠశాలకు వెళ్లేందుకు తండా విద్యార్థులు ఆసక్తి చూపరని, తద్వారా గైర్హాజరు అయ్యే అవకాశముందని సర్పంచ్ వివరించారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>