సైబర్ నేరాలపై భద్రాద్రి పోలీసుల సమర శంఖం.. ‘సురక్ష కా తిరంగా’ ప్రారంభం!

కలం, ఖమ్మం బ్యూరో: డిజిటల్ యుగంలో అమాయకులను ముంచెత్తుతున్న సైబర్ నేరగాళ్లపై భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా పోలీసులు సమర శంఖం పూరించారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో నేతృత్వంలో స్వాతంత్య్ర మాసాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా చేపట్టనున్న “సురక్ష కా తిరంగా – సైబర్ స్వతంత్ర తెలంగాణ” (Suraksha Ka Tiranga) సైబర్ అవగాహన ప్రచారానికి జిల్లా పోలీసులు శ్రీకారం చుట్టారు. మంగళవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఈ ప్రచారానికి సంబంధించిన పోస్టర్‌ను జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆవిష్కరించారు.

​ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. సైబర్ నేర రహిత సమాజమే లక్ష్యంగా ఆగస్టు నెల పొడవునా జిల్లావ్యాప్తంగా విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. జాతీయ సైబర్ జాగృక్త దివస్ సందర్భంగా ఆగస్టు 5వ తేదీ నుండి జిల్లాలోని పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, వ్యాపార సంస్థలు, పరిశ్రమలు, మహిళా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ల భాగస్వామ్యంతో సామాన్య ప్రజలందరికీ సైబర్ భద్రతపై చైతన్య సదస్సులు చేపడతామన్నారు.

​ముఖ్యంగా ఇటీవల కాలంలో ప్రజలను ఆకర్షించి ముంచేస్తున్న స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్‌మెంట్ మోసాలు, బిజినెస్ ఇన్వెస్ట్‌మెంట్ పేర్లతో జరుగుతున్న ఆన్‌లైన్ దందాల పట్ల ప్రతి ఒక్కరూ అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ హెచ్చరించారు. ఈ ప్రచార ముఖ్య సందేశమైన “ఆగు – ఆలోచించు, నిజం నిర్ధారించు, సైబర్ భద్రత పెంచు” అనే మూడు అంశాలను ప్రతి పౌరుడూ తమ నిత్యజీవితంలో ఆచరించాలని పిలుపునిచ్చారు.

​ఒకవేళ దురదృష్టవశాత్తు ఎవరైనా సైబర్ మోసానికి గురైతే, కాలయాపన చేయకుండా తక్షణమే 1930 హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు నమోదు చేయాలని సూచించారు. బాధితులు వెంటనే స్పందిస్తే పోగొట్టుకున్న సొమ్మును పునరుద్ధరించే అవకాశం ఉంటుందన్నారు. ప్రతి పౌరుడూ చైతన్యంతో అప్రమత్తంగా ఉన్నప్పుడే సైబర్ సురక్షిత, సైబర్ స్వతంత్ర తెలంగాణ నిర్మాణం సాధ్యమవుతుందని ఎస్పీ ఆకాంక్షించారు. ​ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో జిల్లా ఏఆర్ డీఎస్పీ సత్యనారాయణ, సైబర్ సెల్ సీఐ జితేందర్, ఎస్బీ-II ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, వెల్ఫేర్ ఆర్ఐ కృష్ణారావు, సైబర్ సెల్ ఎస్సై జుబేదా బేగం, సైబర్ సెల్ సిబ్బంది పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>