కలం, తెలంగాణ బ్యూరో: ఈ ఏడాది ‘రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు’ (State Teacher Awards) ఎంపిక ప్రక్రియ మొదలైంది. అర్హులైన ఉపాధ్యాయులను ఎంపిక చేయడానికి నిర్దిష్ట మార్గదర్శకాలు జారీ అయ్యాయి. గతంలో ఎన్నటికంటే ఈసారి మరింత పారదర్శకంగా, పనితీరు ఆధారంగా సెలెక్షన్ ప్రాసెస్ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఇందుకోసం ప్రత్యేకంగా ప్రొఫార్మాను రూపొందించింది.
టీచర్ల సర్వీస్ వివరాలతో పాటు విద్యార్థుల అడ్మిషన్లు, ఆ ఉపాధ్యాయుల పర్యవేక్షణలో సాధించిన ఉత్తీర్ణతా ఫలితాలు, బోధనలో అవలంబించిన వినూత్న విధానాలు, పాఠశాల అభివృద్ధికి చేసిన కృషి, మౌలిక వసతుల కల్పన, పర్యావరణ పరిరక్షణ తదితర అనేక అంశాలను సమగ్రంగా పరిశీలించాల్సిందిగా విద్యాశాఖ నుంచి సర్క్యులర్ జారీ అయింది. అన్ని జిల్లాల విద్యాశాఖాధికారులు ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేసేటప్పుడు వీటిని తు.చ. తప్పకుండా పాటించాలని ఆ సర్క్యులర్‌లో స్పష్టం చేసింది.
పనితీరులో కీలక అంశాలు
విద్యాశాఖ జారీ చేసిన సర్క్యులర్‌లో పేర్కొన్న ప్రొఫార్మా ప్రకారం.. ఉపాధ్యాయుల వ్యక్తిగత వివరాలు, విద్యార్హతలు, వృత్తిపరమైన అర్హతలు, ఉద్యోగంలో చేరిన తేదీ, కంటిన్యూగా ఉన్న సర్వీసు పీరియడ్, ప్రస్తుతం పనిచేస్తున్న పాఠశాల, గతంలో పనిచేసిన పాఠశాలల వివరాలను నమోదు చేయాలి. పనిచేసిన కాలం ప్రాథమిక లేదా ఉన్నత పాఠశాలల్లో బోధించిన సబ్జెక్టులు, ఒకవేళ ఆదివాసీ/గిరిజన ఏజెన్సీ ప్రాంతాల్లో పనిచేసినా, లేక మురికివాడల్లో (స్లమ్) ప్రాంతాల్లో పనిచేసినట్లయితే వాటి వివరాలను కూడా నమోదు చేయాల్సి ఉంటుంది.
ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేయాల్సి ఉన్నందున వారి పనితీరే కీలకమని, దీనికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం ఆ సర్క్యులర్‌లో పేర్కొన్నది. వీటికితోడు హాజరైన విద్యార్థుల సంఖ్య, ఉత్తీర్ణులైన విద్యార్థుల సంఖ్య, ఉత్తీర్ణతాశాతం, సగటు మార్కులు, బోధించిన తరగతులు, పదో తరగతి ఫలితాలు.. వీటిని కూడా జతపర్చాల్సి ఉంటుంది. గడచిన రెండేండ్లలో సాధించిన ఫలితాలు, పనితీరుకు ప్రత్యేక ఇంపార్టెన్స్ ఉంటుంది.
సర్క్యులర్‌లోని ముఖ్యాంశాలు:
గడచిన రెండు విద్యా సంవత్సరాల్లో (2024-25, 2025-26) ఉపాధ్యాయుల పనితీరు కోసం విద్యాశాఖ రూపొందించిన అంశాలు ఇవీ:
• విద్యా సంవత్సరాల్లో విద్యార్థులను చేర్పించడంలో అపూర్వమైన పనితీరు
• టీచర్ పనిచేస్తున్న స్కూల్‌లో తగ్గిన డ్రాపౌట్ల రేటు, జిల్లా గణాంకాలతో పోలిస్తే వ్యత్యాసం
• పదో తరగతి పరీక్షలకు హాజరైన విద్యార్థులు, 100% మార్కులతో ఉత్తీర్ణులైనవారు, మొత్తంగా ఉత్తీర్ణులైన విద్యార్థుల సంఖ్య
• జీపీఏ 9 ప్లస్ సాధించిన విద్యార్థుల సంఖ్య
• రాష్ట్రస్థాయి ఎగ్జిబిషన్, జాతీయ స్థాయి పోటీల్లో ప్రత్యేక అవార్డులు సాధించిన విద్యార్థుల వివరాలు
• టీచర్‌గా, హెడ్‌మాస్టర్‌గా అమలు చేసిన సృజనాత్మక వివరాలు
• 100% ఆధార్ అనుసంధానం
• కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులతో పాఠశాలల్లో తాగునీటి సరఫరా, టాయ్‌లెట్లు లాంటి మౌలిక సౌకర్యాల మెరుగుదలలో చూపించిన చొరవ, సాధించిన ప్రగతి
• ‘వన మహోత్సవం’, కిచెన్ గార్డెన్ పెంపకం, నాటిన మొక్కల సంఖ్య
• గతంలో వచ్చిన ఫిర్యాదులు, నమోదైన కేసులు

