కలం, వెబ్‌డెస్క్: కాక్రోచ్ జనతా పార్టీ (Cockroach Janta Party) వ్యవస్థాపకుడు అభిజీత్ డిప్కే (Abhijeet Dipke)పై ఢిల్లీలో మరో కేసు నమోదైంది. సోషల్ మీడియా ఇన్‌ఫ్ల్యూయెన్సర్ ఫైజాన్ అన్సారీ (Faizan Ansari) తనపై అభిజీత్ అనుచరులు దాడి చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా అన్సారీ మాట్లాడుతూ.. అభిజీత్ డిప్కేపై ఢిల్లీ డీసీపీకి లిఖితపూర్వక ఫిర్యాదు చేశానని, అతని అనుచరులు తనపై దాడి చేసినట్లు అన్ని ఆధారాలు ఉన్నాయని చెప్పారు. పుణేలో, ఔరంగాబాద్‌లో తనపై దాడులు జరిగినట్లు వెల్లడించారు.
ఆ ఘటనలకు సంబంధించిన రెండు కేసులు ఇప్పటికే నమోదయ్యాయన్నారు. ఢిల్లీ పోలీసులు వెంటనే డిప్కేను అరెస్ట్ చేయాలని కోరారు. అభిజీత్‌పై అన్సారీ తీవ్ర ఆరోపణలు చేశారు. అతను చేసేదంతా తన స్వార్థ ప్రయోజనాల కోసమేనని, అనవసరంగా యువతను రెచ్చగొడుతున్నాడని ఆరోపించారు. అలాగే సరైన సమయంలో సోనమ్ వాంగ్‌చుక్‌ను అదుపులోకి తీసుకుని ఢిల్లీలో పరిస్థితులు ఉద్రిక్తం కాకుండా చేశారంటూ ఢిల్లీ సీఎం, ఢిల్లీ పోలీసులను అభినందించారు.

