కలం, వరంగల్ : జిల్లాలో వన మహోత్సవం–2026 (Vana Mahotsavam) కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేసి, అన్ని శాఖలకు కేటాయించిన మొక్కల నాటకం లక్ష్యాలను నిర్దేశిత గడువులోగా 100 శాతం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ (Warangal Collector) డాక్టర్ సత్య శారద (Satya Sharada) అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో జిల్లా అటవీ అధికారి నిఖిలతో కలిసి నిర్వహించిన జిల్లా స్థాయి మానిటరింగ్ అండ్ కోఆర్డినేషన్ కమిటీ సమావేశంలో శాఖల వారీగా మొక్కల నాటకం, జియో ట్యాగింగ్, మొక్కల సంరక్షణ చర్యలపై సమీక్ష నిర్వహించారు.
జిల్లాకు ఈ ఏడాది 25.51 లక్షల మొక్కలు నాటే లక్ష్యం ఉండగా, ఇప్పటివరకు 7.27 లక్షల మొక్కలు నాటినట్లు కలెక్టర్ తెలిపారు. లక్ష్యాలను ఇంకా పూర్తి చేయని శాఖల అధికారులు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి, మిగిలిన మొక్కల నాటకాన్ని గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. నాటిన ప్రతి మొక్క మనుగడను నిర్ధారించేలా సంరక్షణ చర్యలు చేపట్టాలని, అలాగే జియో ట్యాగింగ్ ప్రక్రియను వేగవంతం చేసి ప్రతి మొక్కను తప్పనిసరిగా నమోదు చేయాలని ఆదేశించారు. వర్షాకాలాన్ని సద్వినియోగం చేసుకుని రోజువారీ కార్యాచరణతో మిగిలిన లక్ష్యాలను పూర్తి చేసి, వన మహోత్సవం అమలులో వరంగల్ జిల్లాను రాష్ట్రంలో ఆదర్శంగా నిలపాలని కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధికారులకు పిలుపునిచ్చారు.

