ప్రజావాణి ఫిర్యాదులను సత్వరం పరిష్కరించాలి : కలెక్టర్

కలం, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌ బ్యూరో : ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను సత్వరం పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా (Collector Khushboo Gupta) అధికారులకు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.ఎల్.బి హరిప్రియ తో కలిసి అర్జిదారుల నుండి దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా అర్జిదారుల సమస్యలను సావధానంగా విన్నారు. ప్రతి సమస్యను జాగ్రత్తగా పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వారికి భరోసా ఇచ్చారు.

అధికారులు ప్రజావాణి దరఖాస్తులను క్షుణ్ణంగా చదివి అర్థంచేసుకుని క్షేత్ర స్థాయిలో పరిశీలించి సత్వరం పరిష్కరించాలని అన్నారు. ప్రజావాణిలో పంచాయతీరాజ్, మున్సిపల్, నీటిపారుదల, జిల్లా సంక్షేమం, వ్యవసాయం, పౌరసరఫరాల శాఖ, భూ సర్వే రికార్డులు, గృహ నిర్మాణం, రోడ్డు రవాణా, పోలీస్, గిరిజన అభివృద్ధి శాఖ, విద్యుత్ శాఖ, విద్య, వైద్య ఆరోగ్యం , మైనింగ్, అటవీ, గ్రామీణ అభివృద్ధి, తదితర శాఖలకు సంబంధించిన మొత్తం 142 వినతులను అధికారులు స్వీకరించారు.

ప్రజావాణి కార్యక్రమం అనంతరం జిల్లా సంక్షేమ శాఖ రూపొందించిన పౌష్టిక ఆహార అవగాహన పోస్టర్ ను జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ అండర్ ట్రైనీ సాయి శివాని, భూ సేకరణ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ రామ్ రెడ్డి, జెడ్. పి. సి. ఈ.ఓ, ఇంచార్జి డి. పి. ఓ వెంకట రెడ్డి, డి. ఆర్. డి.ఓ నరసింహులు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

తల్లి పాల వారోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ

ప్రపంచ తల్లి పాల వారోత్సవాలు (ఆగస్టు 1 నుంచి 7 వరకు) సందర్భంగా తల్లి పాల ప్రాముఖ్యతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ రూపొందించిన ప్రచార పోస్టర్లను జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా ఐఏఎస్ మాట్లాడుతూ.. తల్లి పాలు శిశువుకు ప్రకృతి ప్రసాదించిన సంపూర్ణ ఆహారమని తెలిపారు. శిశువు జన్మించిన తొలి గంటలోనే తల్లి పాలు ఇవ్వడం అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. పుట్టినప్పటి నుంచి మొదటి ఆరు నెలల వరకు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని, అనంతరం తగిన పౌష్టికాహారంతో పాటు రెండేళ్ల వయస్సు వరకు తల్లి పాలను కొనసాగించాలని సూచించారు. తల్లి పాలు శిశువుకు అవసరమైన సంపూర్ణ పోషకాలను అందించడమే కాకుండా రోగనిరోధక శక్తిని పెంపొందించి, అనేక అంటువ్యాధుల నుంచి రక్షిస్తాయని తెలిపారు. అలాగే తల్లి పాలు ఇవ్వడం వల్ల తల్లి ఆరోగ్యానికీ అనేక ప్రయోజనాలు ఉన్నాయని పేర్కొన్నారు.

ఈ ఏడాది ప్రపంచ తల్లిపాల వారోత్సవాల థీమ్ “తల్లిపాలకు ప్రాధాన్యత ఇద్దాం – సుస్థిరమైన సహాయ వ్యవస్థలను ఏర్పాటు చేద్దాం” అనే సందేశాన్ని ప్రజల్లో విస్తృతంగా చేర్చేందుకు జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా సంక్షేమ అధికారి శ్రీమతి జరీన బేగం మాట్లాడుతూ, మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆగస్టు 1 నుంచి 7 వరకు జిల్లా, మండల, గ్రామ స్థాయిల్లో ర్యాలీలు, అవగాహన సదస్సులు, అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గర్భిణీలు, బాలింతలు, వారి కుటుంబ సభ్యులు తల్లిపాల ప్రాధాన్యతను గుర్తించి, శిశువు జన్మించిన తొలి గంటలోనే తల్లిపాలిచ్చే అలవాటును ప్రోత్సహించాలని, అలాగే మొదటి ఆరు నెలల పాటు కేవలం తల్లిపాలే అందించాలని కోరారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>