హైకోర్టు తీర్పుతో కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి బట్టబయలు: హరీశ్ రావు

కలం, వెబ్ డెస్క్: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై హైకోర్టు అనర్హత వేటుపై బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) స్పందించారు. రాజ్యాంగం విషయంలో కాంగ్రెస్ ద్వంద్వ వైఖరిని దానం నాగేందర్ ఉదంతం బయటపెట్టిందని ‘ఎక్స్’ వేదికగా స్పష్టం చేశారు. దానం అనర్హత కేసులో అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వ ద్వంద్వ వైఖరిని బట్టబయలు చేసిందని పేర్కొన్నారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా గెలిచిన  దానం నాగేందర్.. కాంగ్రెస్‌లో చేరి, ఆ పార్టీ తరపున లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తూనే ఎమ్మెల్యేగా కొనసాగారని తెలిపారు. ప్రజల తీర్పు పవిత్రతను కాపాడటానికి బదులుగా, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నిర్ణయం ఆయనకు రక్షణ కల్పించిందని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో స్పీకర్ వ్యవహరించిన తీరుపై హైకోర్టు తీర్పు ఇప్పుడు అనేక ప్రశ్నలను లేవనెత్తిందని రాసుకొచ్చారు.

హైకోర్టు సంచలన తీర్పు వెలువరించిన నేపథ్యంలో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విషయంలోనైనా స్పీకర్ రాజ్యాంగం, చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి రాజ్యాంగ పరిరక్షణపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే, పార్టీ  ఫిరాయింపు ఎమ్మెల్యేలు అందరినీ రాజీనామా చేసి ప్రజల నుండి కొత్త తీర్పును కోరాలని సీఎం రేవంత్ రెడ్డిని ఆదేశించాలని పేర్కొన్నారు. దీనిపై రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. చివరగా ‘సత్యమేవ జయతే!’ అంటూ తన పోస్ట్‌ను ముగించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>