జెన్‌-జీలో బట్టతల.. చిన్న వయసులోనే రాలిపోతున్న జుట్టు

కలం, వెబ్ డెస్క్: జెన్‌-జీని (Gen Z Hair Loss) బట్టతల సమస్య వేధిస్తున్నది. చిన్న వయసులోనే జుట్టు రాలిపోవడం యువతలో ఆందోళన పెంచుతున్నది. ఒకప్పుడు పెద్దవాళ్లలో కనిపించే హెయిర్ లాస్.. ఇప్పుడు యంగ్ ఏజ్లోనే మొదలవుతున్నది. ఈ మార్పును హెల్త్ టెక్ స్టార్టప్ లు భారీ బిజినెస్ అవకాశంగా మలుచుకుంటున్నాయి. పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్లు, డిజిటల్ కన్సల్టేషన్లతో దేశంలో హెయిర్ కేర్ మార్కెట్ వేగంగా విస్తరిస్తున్నది. 2024లో సుమారు 282 మిలియన్ డాలర్లుగా ఉన్న హెయిర్ కేర్ మార్కెట్.. రాబోయే దశాబ్దంలో 539 మిలియన్ డాలర్లకు (దాదాపు రూ.4,500 కోట్లు) పైగా పెరుగుతుందని అంచనా.
చిన్న వయసులోనే జుట్టు రాలిపోవడానికి మారుతున్న మోడ్రన్ లైఫ్ స్టయిల్ లే ప్రధాన కారణమని డెర్మటాలజిస్టులు చెప్తున్నారు. ఒకప్పుడు 30–40 ఏళ్లు దాటిన వారే హెయిర్ లాస్ సమస్యతో క్లినిక్ లను ఆశ్రయించేవారు. కానీ ఇప్పుడు 18 నుంచి 22 ఏళ్ల మధ్య వయసున్న యువకులే ఎక్కువగా వస్తున్నారని అంటున్నారు. సిటీ లైఫ్స్టైల్లో భాగమైన ప్రాసెస్డ్ ఫుడ్, నిద్రలేమి, కెరీర్ ప్రెజర్, ఉద్యోగ ఒత్తిడి, పెరుగుతున్న వాయు కాలుష్యం వంటి అంశాలు శరీరంలో దీర్ఘకాలిక ఇన్ఫ్లమేషన్ కు కారణమవుతున్నాయి. దీంతో వంశపారంపర్యంగా ఉండే హెయిర్ లాస్ జీన్లు ఊహించిన దానికంటే ముందుగానే యాక్టివ్ గా మారి, చిన్న వయసులోనే జుట్టు రాలడం మొదలవుతున్నది. దీనికి తోడు సోషల్ మీడియా ప్రభావంతో యువత తమ లుక్ పై మరింత శ్రద్ధ పెడుతున్నది. ఫొటోలు, వీడియోల్లో చిన్న మార్పు కనిపించినా వెంటనే గుర్తించి హెయిర్ లాస్ పై అప్రమత్తమవుతున్నది.

8.2 కోట్ల మందికి సమస్య..

పరిశోధనా సంస్థ రెడ్‌సీర్ అంచనా ప్రకారం.. దేశంలోని పట్టణ ప్రాంతాల్లో సుమారు 8.2 కోట్ల మంది హెయిర్ లాస్ సమస్యతో బాధపడుతున్నారు. అయితే వీరిలో చాలామంది (దాదాపు 5.9 కోట్ల మంది) ఇంటి చిట్కాలు, సంప్రదాయ పద్ధతులపైనే ఆధారపడుతున్నారు. 1.6 కోట్ల మంది షాంపూలు, సీరమ్లు వంటి ప్రొడక్ట్స్ను వాడుతున్నారు. కేవలం 50 లక్షల మంది మాత్రమే మెడికల్ ట్రీట్మెంట్ కు ప్రయత్నిస్తుండగా, క్లినిక్లను ఆశ్రయించే వారి సంఖ్య సుమారు 10 లక్షలకే పరిమితమైంది.

భారీ గ్యాప్.. స్టార్టప్‌ల టార్గెట్

ఈ భారీ గ్యాప్నే హెల్త్టెక్ స్టార్టప్ కంపెనీలు సరికొత్త బిజినెస్ మోడల్గా మార్చుకున్నాయి. ఇప్పటి వరకు హెయిర్ కేర్ మార్కెట్ ప్రధానంగా షాంపూలు, నూనెలు, సీరమ్ల చుట్టూనే తిరిగింది. కానీ కొత్త తరం హెల్త్ టెక్ కంపెనీలు ఈ ఆలోచనను మార్చుతున్నాయి. జుట్టు సమస్యను కేవలం పైపైన రాసే నూనెతోనో, షాంపూతోనో తగ్గించే కాస్మెటిక్ లోపంగా చూడటం లేదు. ఇది శరీరంలో జరిగే మార్పులకు సంబంధించిన ఆరోగ్య సమస్య అని చెప్తూ.. ముందుగా డయాగ్నోస్టిక్ టెస్ట్ ల ద్వారా కారణాలను గుర్తిస్తున్నాయి. ఆ తర్వాత అల్లోపతి, ఆయుర్వేదం, న్యూట్రిషన్ను కలిపిన పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్ ప్లాన్ను అందిస్తున్నాయి. కనీసం ఐదు నెలల పాటు కొనసాగించాల్సిన ఈ కిట్ల కోసం యువత వేల రూపాయల ప్రీమియం ప్యాకేజీలను కొనుగోలు చేసేందుకు కూడా వెనకాడటం లేదు.

మెట్రోల నుంచి చిన్న పట్టణాల వరకు

హెయిర్ లాస్ ట్రీట్ మెంట్ అనేది కేవలం హైదరాబాద్, ముంబై మెట్రో నగరాల యువతకే పరిమితం కావడం లేదు. చిన్న పట్టణాల్లోనూ జుట్టు సంరక్షణపై ఆసక్తి పెరుగుతున్నది. టైర్‌–2, టైర్‌–3 నగరాల నుంచి వస్తున్న భారీ స్పందన.. హెయిర్ కేర్ రంగంలో మారుతున్న వినియోగదారుల ధోరణికి అద్దం పడుతున్నది. ఆన్లైన్ రీచ్ కోసమే కాకుండా, తమ లుక్స్ విషయంలో చిన్న పట్టణాల యువత కూడా ఏమాత్రం ఖర్చుకు వెనకడుగు వేయకపోవడమే ఈ భారీ డిమాండ్ కు ప్రధాన కారణం.
మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>