కలం, ఖమ్మం బ్యూరో: సోషల్ మీడియా రీల్స్ వివాదంలో సస్పెన్షన్‌కు గురైన ఖమ్మం (Khammam) జిల్లా మామిళ్లగూడెం (Mamillagudaem) ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఇంగ్లీష్ ఉపాధ్యాయురాలు భుక్య గౌతమి (Bhukya Gowthami) సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన వీడియోలో ఆమె భావోద్వేగానికి లోనై కన్నీటి పర్యంతమయ్యారు.
తాను ఎన్నో ఏళ్ల కష్టంతో సాధించుకున్న ప్రభుత్వ ఉద్యోగాన్ని వదులుకోవాల్సి వస్తోందని గౌతమి ఆవేదన వ్యక్తం చేశారు. తెలియక చేసిన చిన్న తప్పుకు ఇంత పెద్ద శిక్ష పడుతుందని ఊహించలేదని అన్నారు. తనపై విధించిన సస్పెన్షన్‌కు సంబంధించి వివరణ ఇచ్చుకునేందుకు పలుమార్లు విద్యాశాఖ అధికారులను కలిసినా స్పందన లభించలేదని ఆరోపించారు.
విద్యాశాఖ కార్యాలయాల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా, తన వాదన వినేందుకు అధికారులు సుముఖత చూపలేదని ఆమె తెలిపారు. అధికారుల నిర్లక్ష్య వైఖరి, తనకు వివరణ ఇచ్చే అవకాశం కూడా ఇవ్వకపోవడం తీవ్ర నిరాశకు గురిచేసిందని పేర్కొన్నారు. కాగా, పాఠశాల విధి నిర్వహణ సమయంలో ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ రూపొందించడం, ప్రైవేట్ విద్యాసంస్థలు, వ్యాపార సంస్థల ప్రచార కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా ప్రభుత్వ ఉద్యోగుల నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలపై విద్యాశాఖ అధికారులు గతంలో గౌతమిని సస్పెండ్ చేశారు.
తనపై కొనసాగుతున్న విమర్శలు, సోషల్ మీడియాలో ఎదురైన తీవ్ర మానసిక ఒత్తిడి, అధికారుల నుంచి సరైన స్పందన లేకపోవడం వంటి కారణాల వల్లే ఉద్యోగానికి రాజీనామా చేయాలనే నిర్ణయం తీసుకున్నట్లు గౌతమి (Bhukya Gowthami) వెల్లడించారు. ప్రస్తుతం ఆమె రాజీనామా ప్రకటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Also Read : నాలో అదే చూస్తారు.. సాయి పల్లవి ఓల్డ్ కామెంట్స్ వైరల్!
Follow Us On : WhatsApp

