కలం, నిర్మల్ : నిర్మల్ జిల్లా బాసర మండలం బాసర – బిద్రెల్లి ప్రధాన రహదారిపై శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదం (Nirmal Accident)లో ఆర్జీయూకేటీ (ట్రిపుల్ ఐటీ)లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న కే. బాబు (50) మృతి చెందారు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. ముధోల్ గ్రామానికి చెందిన కే. బాబు ట్రిపుల్ ఐటీలో రాత్రి విధులకు హాజరయ్యేందుకు ద్విచక్రవాహనంపై బాసరకు బయలుదేరారు.
ఈ క్రమంలో బాసర – బిద్రెల్లి ప్రధాన రహదారిపై పంక్చర్ కారణంగా రోడ్డుపై నిలిచిన లారీని చీకటి కారణంగా గుర్తించలేక వెనుక నుంచి బలంగా ఢీకొట్టారు. ప్రమాదంలో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు, బాసర పోలీసులు వెంటనే స్పందించి 108 అంబులెన్స్‌లో క్షతగాత్రుడిని భైంసా ఏరియా ఆస్పత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ బాబు మృతిచెందారు. డ్యూటీకి వెళ్తున్న సమయంలో జరిగిన ఈ విషాద ఘటనతో ట్రిపుల్ ఐటీ సిబ్బంది, సహోద్యోగులు, కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.

