కలం, నిర్మల్: నిర్మల్ జిల్లా కేంద్రంలోని మల్లన్నగుట్ట (Nirmal Mallanna Gutta) హరిహర క్షేత్రంలో శనివారం అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది. ఆలయ ప్రాంగణంలోని ఉప ఆలయాలైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి, శ్రీ గణపతి, అమ్మవారి ఆలయాలను లక్ష్యంగా చేసుకున్న దుండగులు తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించారు.
ఆలయాల్లో ఉన్న సుమారు 10 కిలోల వెండి ఆభరణాలు, 2.30 తులాల బంగారు ఆభరణాలను ఎట్టుకెళ్లారు. ఆదివారం ఉదయం పూజారులు పూజల కోసం ఆలయానికి చేరుకోగా తాళాలు పగులగొట్టబడిన విషయం గుర్తించి వెంటనే ఆలయ కమిటీకి సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న డీఎస్పీ శ్రీనివాస్ పోలీసు బృందంతో ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీమ్, ఫింగర్ ప్రింట్ నిపుణులు ఆధారాలను సేకరించారు. ఆలయ పరిసరాల్లోని సీసీటీవీ కెమెరాల దృశ్యాలను పరిశీలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

