కలం, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని పలు కార్పొరేషన్ల (Telangana Corporations) చైర్పర్సన్ పోస్టుల భర్తీపై కసరత్తు మొదలైంది. ఏఐసీసీ, కాంగ్రెస్ స్టేట్ ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ సైతం భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు పీసీసీ వర్గాల సమాచారం. జులై చివరికల్లా నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తామని పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ గతంలో ప్రకటించినప్పటికీ, అది కార్యరూపం దాల్చలేదు.
దీంతో పోస్టుల భర్తీలో జరుగుతున్న జాప్యంపై సీఎం రేవంత్ అసంతృప్తి వ్యక్తం చేశారని, ప్రభుత్వం సానుకూలంగా ఉన్నా అర్హుల జాబితా పంపడం లేదనే అభిప్రాయంతో ఉన్నారని తెలిసింది. పీసీసీ చీఫ్ నిర్ణయం తీసుకుని ముసాయిదా జాబితా తీసుకొస్తే ఫైనల్ చేయొచ్చనే యోచనలో ఉన్నట్టు సమాచారం. ఈ వ్యవహారాన్ని కొలిక్క తేవడానికి నిర్దిష్ట షెడ్యూల్ పెట్టుకుని పూర్తి చేయాలన్నది సీఎం, మంత్రుల అభిప్రాయం. దీంతో వీలైనంత తొందరగా ముగించాలని పీసీసీ చీఫ్ భావిస్తున్నారు. ఈ నెలాఖరు కల్లా కీలకమైన పోస్టులు భర్తీ చేసేలా కసరత్తు చేస్తున్నారు.
త్వరలో పీసీసీకి డ్రాఫ్ట్ లిస్ట్
నామినేటెడ్ పోస్టుల విషయంలో తాజాగా గడువు ముగిసినవారిలో ఎవరికి రెన్యూవల్ చేయొచ్చు? కొత్తగా ఎవరికి అవకాశం ఇవ్వాలనేది కీలకంగా మారింది. పార్టీ కోసం సిన్సియర్‌గా పనిచేసిన వారికి మరోసారి అవకాశం ఇవ్వాలని, అలాంటి పరిస్థితి లేనప్పుడు కొత్తవారిని ఎంపిక చేయాలని సీఎం, పీసీసీ చీఫ్, మీనాక్షి ఏకాభిప్రాయానికి వచ్చినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
ఇందులో భాగంగా ఆయా జిల్లాల్లో నామినేటెడ్ పోస్టులు ఆశిస్తున్నవారి పేర్లు, ప్రొఫైల్, పార్టీ కోసం చేసిన వర్క్.. వీటన్నింటిపై ఇన్చార్జ్ మంత్రులు సమావేశం ఏర్పాటు చేయనున్నారు. వీలైనంత తొందరగా డ్రాఫ్ట్ లిస్టును పీసీసీకి అందజేస్తే.. దానిపై పీసీసీ చీఫ్, సీఎం కలిసి ఖరారు చేస్తారన్నది పార్టీ వర్గాల సమాచారం. ఆయా జిల్లాల ఇన్చార్జ్ మంత్రులు వారి వెసులుబాటును బట్టి తొందరగా ఆశావహులతో సమావేశాన్ని పూర్తి చేయాలని పీసీసీ చీఫ్ సూచించారు.
పీసీసీ చీఫ్‌తో మంత్రి తుమ్మల భేటీ
వ్యవసాయ శాఖ పరిధిలోని కొన్ని సంస్థల పోస్టుల భర్తీపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కసరత్తు మొదలుపెట్టారు. ఆయన శనివారం గాంధీభవన్‌లో పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్‌తో సమావేశమై చర్చించారు. ఏయే పోస్టుకు ఎవరు సమర్థులో, ఆసక్తి ఉన్నవారెవరో, పార్టీ కోసం వారు చేసిన కృషి ఏంటో వివరించారు. ఈ భేటీ అనంతరం తుమ్మల మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నా శాఖ పరిధిలోని నామినేటెడ్ పోస్టుల భర్తీపై పీసీసీ చీఫ్‌తో చర్చించాను. ఆశావహుల పేర్ల జాబితాను ఇచ్చాను. దీనిపై సీఎంతో చర్చించిన తర్వాత ఫైనల్ అవుతుంది” అని తెలిపారు.

