కలం, నల్లగొండ బ్యూరో : వచ్చే ఎన్నికల నాటికి అసెంబ్లీ స్థానాల పునర్విభజనలో భాగంగా రిజర్వేషన్లు మారతాయంటూ ప్రచారం జోరందుకుంది. దీంతో ఉమ్మడి నల్లగొండ జిల్లా రాజకీయాల్లో (Nalgonda Politics) సమీకరణాల్లోనూ వేగం పెరిగింది. ఉమ్మడి జిల్లాలో కొందరు లీడర్లు దశాబ్దాల కాలంగా ఒకే నియోజకవర్గాన్ని శాసించే పరిస్థితులు ఉండగా.. 2029 ఎన్నికల్లో రిజర్వేషన్లు మారితే ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో లీడర్లు ఇప్పటినుంచే పక్క నియోజకవర్గాలపై దృష్టి పెట్టారు. టికెట్ కోసం ఖర్చీఫ్ వేసుకునే ప్రయత్నాల్లో బిజీ అయ్యారు. ప్రధానంగా కాంగ్రెస్ లో ఇలాంటి పరిస్థితులు పెరిగిపోయారు. దీంతోనే లీడర్ల మధ్య కోల్డ్ వార్ నెలకొంది.
ఆ రెండింటిపై కోమటిరెడ్డి బ్రదర్స్ చూపు..
ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో తమదైన ముద్ర వేసిన కోమటిరెడ్డి బ్రదర్స్ తీరు హాట్ టాపిక్‌గా మారింది. రిజర్వేషన్లు మారితే ప్రస్తుతం ఎస్సీ రిజర్వుడు నకిరేకల్, తుంగతుర్తి జనరల్ అయ్యే చాన్స్ ఉందనే ప్రచారం ఉంది. ఇదే సమయంలో నల్లగొండ ఎస్సీ గా మారనుందని తెలుస్తోంది. దీంతో కోమటిరెడ్డి బ్రదర్స్ చూపు నకిరేకల్, తుంగతుర్తి స్థానాలపై పడింది. నల్లగొండ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఖాళీ చేసి నకిరేకల్ నుంచి బరిలోకి దిగేందుకు పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తుంగతుర్తి నుంచి బరిలోకి దిగేందుకు గ్రౌండ్ వర్క్ ఇప్పటికే మొదలుపెట్టారని టాక్ వినిపిస్తోంది.
ఇక తన వారసుడిని మునుగోడు నుంచి బరిలోకి దించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఒకవేళ నార్కట్‌పల్లి కేంద్రంగానో.. చిట్యాల కేంద్రంగానో.. కొత్త నియోజకవర్గం ఏర్పడితే అక్కడి నుంచి కూడా బరిలోకి దిగాలని ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. నకిరేకల్ సెగ్మెంట్ పరిధిలోని నార్కట్‌పల్లిలోనే తన సొంతూరు ఉంది.
ఇక శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు గుత్తా అమిత్ రెడ్డి సైతం ఆ దిశగానే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అందులో భాగంగానే చిట్యాల మండలంలో ఇప్పటికే అమిత్ పూర్తిస్థాయి రాజకీయాల్లో ఇన్ వాల్వ్ అయ్యారని, సొంతూరిలోనూ అన్ని పనులు దగ్గరుండీ చక్కబెడుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సైతం తుంగతుర్తి టికెట్‌పై గురిపెట్టినట్టు తెలుస్తోంది.
సొంతపార్టీ నేతల్లో ముదిరిన కోల్డ్ వార్..
ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ లీడర్ల మధ్య కోల్డ్ వార్ నెలకొంది. ఇందులో భాగంగానే తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలుపై పక్కా ప్లాన్‌తో ఓ వైపు చామల కిరణ్.. మరోవైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముప్పేట దాడి చేస్తున్నారని సొంత క్యాడర్ ఆరోపిస్తోంది. ఈ కోల్డ్ వార్ కాస్త బహిరంగంగా కొట్టుకోవడం.. గాంధీ భవన్ ఎదుట ధర్నాకు దిగడం.. ఆరోపణలు, ప్రతి ఆరోపణలతో తుంగతుర్తి రాష్ట్ర రాజకీయాల్లోనే హాట్ టాపిక్‌గా నిలిచింది.
ఇదే సమయంలో నకిరేకల్ లో స్థానిక ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా వర్గపోరును ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు. నార్కట్‌పల్లి మండలంలో ఓ ప్రైవేటు ఫంక్షన్ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం వర్గీయులు బాహాబాహీకి దిగడం చర్చనీయాంశమైంది. సాధారణ ఎన్నికలకు దాదాపు రెండున్నరేండ్ల సమయం ఉంది. సొంత పార్టీ లీడర్ల మధ్య ఘర్షణ వాతావరణం ప్రత్యర్థులకు అవకాశం ఇచ్చినట్టు అవుతుందని కాంగ్రెస్ కేడర్ ఆందోళనలో పడింది. ఏదీఏమైనప్పటికీ రిజర్వేషన్ల మార్పు అంశం.. ఉమ్మడి నల్లగొండ జిల్లా రాజకీయాలను అతలాకుతలం చేస్తోంది.
బీఆర్ఎస్లోనూ ఇదే పరిస్థితి..
ఉమ్మడి జిల్లాలోని నియోజకవర్గాల రిజర్వేషన్లు మారతాయనే ప్రచారంతో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు సైతం ఇతర నియోజకవర్గాల్లో ఖర్చీఫ్ వేసేందుకు ప్రయత్నాలు. నల్లగొండపై మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పోటీకి సై. తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ సైతం నల్లగొండ నుంచే పోటీ చేస్తారంటూ ఆయన సన్నిహితుల టాక్. ఒకవేళ రిజర్వేషన్లు మారకపోయినా.. ఇక్కడి మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డిని తప్పించి.. తాము బరిలో దిగేందుకు రెడ్డి సామాజికవర్గానికి చెందిన లీడర్లు విశ్వప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం.

