కలం, తెలంగాణ బ్యూరో: అర్హులైన అందరికీ సామాజిక భద్రత పథకాలను అందించాలని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం దశలవారీగా కొత్త లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నది. ఇటీవల నిర్వహించిన కులగణన గణాంకాల ఆధారంగా రానున్న రోజుల్లో ఒక్కో కేటగిరీ కింద పింఛన్ (Telangana Pensions) స్కీమ్‌ను విస్తరించాలనుకుంటున్నది. పంద్రాగస్టు నుంచి తలసేమియా, సికిల్‌సెల్ ఎనిమియా బాధితులకు కూడా పింఛన్లను ఇవ్వనున్నట్లు ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.
దివ్యాంగుల విషయంలో భర్త చనిపోతే ఆ పింఛన్ సాయాన్ని భార్యకు కొనసాగించాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. రానున్న రోజుల్లో అర్హులైన అందరినీ పింఛన్ల స్కీమ్ పరిధిలోకి తేవాలని ప్రభుత్వం భావిస్తున్నది. కొత్తగా సుమారు 10 లక్షల మంది అర్హులు ఉంటారని, వీరిని లబ్ధిదారులుగా చేరిస్తే ఖజానాపై ఏటా సుమారు రెండున్నర వేల కోట్ల మేర అదనపు భారం పడనున్నట్లు అంచనా. ఆర్థిక పరిస్థితికి తగ్గట్టు రాష్ట్ర సర్కారు కొత్త లబ్ధిదారులను జాబితాలో చేర్చడంపై నిర్ణయం తీసుకోనున్నది.
పంద్రాగస్టు నుంచి దశలవారీగా..!
ఇప్పటివరకూ 11 రకాల పింఛన్లు అమల్లో ఉండగా ఈ ఏడాది పంద్రాగస్టు కానుకగా తలసేమియా, సికిల్ సెల్, ఎనిమియా బాధితులకు కూడా అందనున్నది. ఆ తర్వాత అర్హులైన ఇతర కేటగిరీల వారికీ అందించాలన్నది ప్రభుత్వం ఉద్దేశం. ఎన్నికల హామీల అమలు, సామాజిక న్యాయం, బలహీన వర్గాలకు భరోసా కల్పించాలని భావిస్తున్నది. తొలిసారిగా నిర్వహించిన సమగ్ర కులగణన ప్రభుత్వానికి సంక్షేమ పథకాల లక్ష్య సాధనలో కీలక ఆధారంగా మారింది.
గతంలో వివిధ కారణాలతో పింఛన్లకు దరఖాస్తు చేసుకోలేకపోయినవారు, అర్హత ఉన్నా జాబితాలో చేరనివారు, కొత్తగా అర్హత సాధించినవారి వివరాలు కులగణనలో నమోదయ్యాయి. ఇందులో సుమారు 10.35 లక్షల మంది పింఛన్లకు అర్హులని ప్రభుత్వం గుర్తించింది. వీరిని కూడా జాబితాలో చేరిస్తే మొత్తం లబ్ధిదారుల సంఖ్య దాదాపు 51.40 లక్షలకు చేరుతుంది. ఖర్చు ప్రతి ఏటా సుమారు రూ. 3,400 కోట్లకు చేరుకుంటుంది.
దేశంలోనే తొలి రాష్ట్రంగా..!
ఇప్పటివరకు దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వమూ తలసేమియా, సికిల్ సెల్ ఎనిమియా బాధితులకు ప్రతి నెలా పెన్షన్లు ఇచ్చే స్కీమ్‌ను అమలు చేయడంలేదని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. దేశంలోనే తొలిసారిగా తెలంగాణ ప్రభుత్వం దీనికి శ్రీకారం చుడుతున్నదని చెప్తున్నాయి. రాష్ట్రంలో ఈ రెండు రకాల బాధితులు గరిష్ట స్థాయిలో 8 వేల మంది ఉండొచ్చని అంచనా. కొన్ని స్వచ్ఛంద సంస్థలు వీరి కోసం పనిచేస్తున్నాయి. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆరోగ్య బీమా, ఉచిత ట్రీట్మెంట్, స్క్రీనింగ్ సౌకర్యం లాంటివి కల్పిస్తున్నాయి.
తెలంగాణ ప్రభుత్వం ఫస్ట్ టైమ్ పింఛను సౌకర్యాన్ని అందిస్తున్నది. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా అందుబాటులోకి వెబ్ పోర్టల్‌లో దేశవ్యాప్తంగా 4,361 మంది పేర్లను నమోదు చేసుకున్నారు. తెలంగాణలో ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్ ఖమ్మం పట్టణాల్లో వీరి కోసం రాష్ట్ర ప్రభుత్వం డే-కేర్ సెంటర్లను నడుపుతున్నది. మంచిర్యాల, ఆసిఫాబాద్, కరీంనగర్ పట్టణాల్లోనూ బాధితులు ఉన్నట్లు తేలడంతో అక్కడ కూడా ఓపెన్ చేయనున్నది.
లెక్కల్లో పింఛన్ లబ్ధిదారులు : (జులై 2026 నాటికి)
కేటగిరీ లబ్ధిదారులు పింఛన్ (ఒక్కొక్కరికి..రూపాయల్లో) మొత్తం (రూపాయల్లో)
వితంతు 14,74,411 2,016 297.24 కోట్లు
వృద్ధాప్య 14,31,814 2,016 288.65 కోట్లు
దివ్యాంగులు 4,71,430 4,016 189.33 కోట్లు
ఒంటరి మహిళలు 1,38,106 2,016 27.84 కోట్లు
గీత కార్మికులు 59,611 2,016 12.02 కోట్లు
నేత కార్మికులు 33,887 2,016 9.40 కోట్లు
బీడీ కార్మికులు 4,20,168 2,016 84.71 కోట్లు
ఫైలేరియా 16,922 2,016 3.41 కోట్లు
డయాలసిస్ 9,808 2,016 1.98 కోట్లు
హెచ్ఐవీ 46,646 2,016 9.40 కోట్లు
బీడీ టేకేదార్లు 3,749 2,016 0.76 కోట్లు
మొత్తం 41,06,552 922.17 కోట్లు
రెండున్నరేండ్లలో చేరికలు, డిలీషన్లు
2023 డిసెంబర్ నాటికి : 43,55,649 మంది
మృతులు, ఇతరుల తొలగింపు : 4,07,297 మంది
కొత్తగా అర్హులైనవారు : 1,23,625 మంది
రోల్ బ్యాక్ అయినవారు : 34,575 మంది
ప్రస్తుత లైవ్ పెన్షనర్లు : 41,06,552 మంది
డిలీట్ అయినవి : 2,49,097
కులగణన లెక్కల ప్రకారం కొత్తవి : (అంచనా)
దివ్యాంగులు : 1,22,000
వింతుతు, ఒంటరి మహిళలు : 2,03,000
వృద్ధాప్య : 5,00,000
గీత కార్మికులు : 4,000
నేత కార్మికులు : 3,000
బీడీ కార్మికులు, టేకేదార్లు : 2,000
మొత్తం : 10,35,000
అదనంగా కావాల్సిన మొత్తం : రూ. 2,500 కోట్లు

