కలం, హనుమకొండ : హనుమకొండ (Hanumakonda) జిల్లాలోని కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. నాలుగో డివిజన్ పరిధిలోని కృష్ణకాలనీలో అనిల్ అనే వ్యక్తి తన భార్య రజితను హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఈ దారుణం జరిగినట్లు ప్రాథమిక సమాచారం.
మహిళను హత్య చేసిన అనంతరం నిందితుడు అక్కడి నుంచి పరారైనట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో కాకతీయ యూనివర్సిటీ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఘటనకు గల పూర్తి కారణాలు, నిందితుడి ఆచూకీపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

