కలం, వెబ్‌డెస్క్: గాయం భయం ఉన్నా.. నీరజ్ చోప్రా (Neeraj Chopra) వెనక్కి తగ్గలేదు. కామన్వెల్త్ గేమ్స్ 2026లో పురుషుల జావెలిన్ త్రోలో రజత పతకం గెలిచి మరోసారి పోడియంపై నిలిచాడు. దాదాపు ఏడాది తర్వాత పెద్ద టోర్నీలో అతనికి వచ్చిన తొలి పతకం ఇదే. గాయాల కారణంగా గత కొంతకాలంగా ఇబ్బందులు ఎదుర్కొన్న నీరజ్.. ఈసారి సీజన్లో అత్యుత్తమంగా 85.83 మీటర్లు విసిరాడు. అయితే 89.75 మీటర్ల భారీ త్రోతో శ్రీలంకకు చెందిన రుమేశ్ తరంగా పతిరాజే స్వర్ణ పతకం గెలిచాడు.
పోటీ ముగిసిన తర్వాత నీరజ్ మాట్లాడుతూ.. తన కంబ్యాక్ సరైన దారిలో సాగుతోందని తెలిపాడు. చలిలో తాను ఆశించిన స్థాయిలో రాణించలేనని, అయినా మళ్లీ పోడియంపై నిలవడం ఆనందంగా ఉందని చెప్పాడు. తాను చేసిన కష్టానికి ఇప్పుడు ఫలితం కనిపిస్తోందని పేర్కొన్నాడు. గాయం పూర్తిగా తగ్గితే పోరాడే ధైర్యం మరింత పెరుగుతుందని నీరజ్ వెల్లడించాడు. కానీ గాయం ఉంటే ప్రతి ప్రయత్నం ముందు భయం ఉంటుందని చెప్పాడు.
ఈ పోటీలో కూడా అదే ఆలోచనతో శరీరంపై ఒత్తిడి పడకుండా జాగ్రత్తగా త్రో చేసినట్లు వివరించాడు. భారత్‌కు చెందిన యశ్ వీర్ సింగ్ కూడా మెరిశాడు. చివరి ప్రయత్నంలో వ్యక్తిగత అత్యుత్తమమైన 85.41 మీటర్లు విసిరి కాంస్య పతకం సాధించాడు. గ్లాస్గోలోని చలి వాతావరణం అందరికీ సవాల్‌గా మారిందని నీరజ్ తెలిపాడు. తనకు ఒక్క త్రో మాత్రమే బాగా వచ్చిందని, మిగిలిన ప్రయత్నాలు ఇంకా మెరుగ్గా ఉండాల్సిందని చెప్పాడు.
జావెలిన్ ఆశించిన విధంగా వెళ్లలేదని వివరించాడు. స్వర్ణ విజేత రుమేశ్ తరంగా పతిరాజే కూడా ఒక్క అద్భుతమైన త్రోతోనే విజయం సాధించాడని నీరజ్ పేర్కొన్నాడు. మంచి ఒక్క ప్రయత్నం కూడా ఫలితాన్ని మార్చగలదని వివరించాడు. ఈ రజత పతకం ఆనందాన్ని ఇచ్చినా.. తన అసలు లక్ష్యం ఇంకా మెరుగైన ప్రదర్శనేనని నీరజ్ స్పష్టం చేశాడు. రాబోయే పోటీల్లో క్రమంగా మరింత మెరుగైన త్రోలు నమోదు చేయడంపైనే దృష్టి పెట్టనున్నట్లు తెలిపాడు.

