కలం, వెబ్‌డెస్క్: కామన్వెల్త్ గేమ్స్ 2026 జావెలిన్ త్రోలో శ్రీలంక సంచలనం రుమేష్ పతిరగే (Rumesh Pathirage) అద్భుతం చేశాడు. భారత స్టార్ నీరజ్ చోప్రా (Neeraj Chopra)ను వెనక్కి నెట్టి పసిడి పతకాన్ని ముద్దాడాడు. క్రికెట్ మైదానంలో గంటకు 134 కిలోమీటర్ల వేగంతో బంతులు విసిరిన ఒక ఫాస్ట్ బౌలర్, ఇప్పుడు కామన్వెల్త్ గేమ్స్ లో ఈటెను విసిరి బంగారు పతకం సాధించాడు. పతిరగే పాఠశాల రోజుల్లో ఈయూ-18 విభాగంలో మీడియం పేస్ బౌలర్‌గా రాణించాడు. ఆ విభాగంలో శ్రీలంక స్టార్ బౌలర్ ఈషాన్ మలింగ తర్వాత అత్యంత వేగంగా బౌలింగ్ చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు.
అయితే అతడిలోని అసలు ప్రతిభను కోచ్ టోనీ ప్రసన్న గుర్తించి, పతిరగేను జావెలిన్ త్రో వైపు నడిపించాడు. ప్రాథమికాంశాలను సరిగ్గా పాటిస్తే మంచి ఫలితాలు వస్తాయని కోచ్ ఇచ్చిన ధైర్యంతో పతిరగే (Rumesh Pathirage) జావెలిన పట్టాడు. శ్రీలంక తరఫున 85 మీటర్ల మార్కు దాటిన తొలి అథ్లెట్‌గా రికార్డు సృష్టించిన అతడు, గతేడాది తన మొదటి ప్రపంచ ఛాంపియన్‌షిప్ లోనే ఏడో స్థానాన్ని దక్కించుకున్నాడు. తన ప్రతిభను మరింత పెంచుకుంటూ 2026 సీజన్ రోమ్ డైమండ్ లీగ్ లో 90 మీటర్ల మార్కును దాటిన తొలి త్రోయర్‌గా నిలిచాడు.
ఈ సీజన్ లో 92.62 మీటర్ల త్రోతో వరల్డ్ లీడ్ లో కొనసాగాడు. ఇప్పుడు కామన్వెల్త్ గేమ్స్ 2026 లో 89.75 మీటర్ల దూరం విసిరి స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నాడు. మరోవైపు భారత్‌కు చెందిన నీరజ్ చోప్రా 85.83 మీటర్లతో వెండి పతకం సాధించగా, యష్‌వీర్ సింగ్ 85.41 మీటర్ల త్రోతో కాంస్య పతకం గెలుచుకున్నాడు. విజయం సాధించడానికి పతిరగేకు ఒక్క మంచి త్రో సరిపోయిందని నీరజ్ చోప్రా మ్యాచ్ తర్వాత తెలిపాడు.
Also Read : పవన్ భార్య దాతృత్వం.. బర్త్‌డే రోజు ఏం చేసిందంటే?
Follow Us On : WhatsApp

