కలం, ఖమ్మం బ్యూరో: నవజాత శిశువుకు తల్లిపాలే అమృతంతో సమానమని, బిడ్డ పుట్టిన మొదటి ఆరు నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే పట్టడం వారి శారీరక, మానసిక ఎదుగుదలకు అత్యంత ఆవశ్యకమని జిల్లా సంక్షేమ అధికారిణి జె. స్వర్ణలత (Swarnalatha) లేనినా స్పష్టం చేశారు. ప్రయాణాల్లో ఉన్న బాలింతల సౌకర్యార్థం స్థానిక భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) ఆర్టీసీ బస్టాండ్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన ‘తల్లిపాలిచ్చే గది’ (Breastfeeding Room) ని ఆమె శనివారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న బాలింతలతో ఆమె మాట్లాడి, బిడ్డకు తల్లిపాలు ఇవ్వడం వల్ల కలిగే ప్రయోజనాలు వాటి అవశ్యకతపై ప్రత్యేకంగా అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా జిల్లా సంక్షేమ అధికారిణి మాట్లాడుతూ.. ప్రసవించిన మొదటి గంటలోనే బిడ్డకు పాలు పట్టడం ప్రారంభించాలని, ఇందుకోసం కుటుంబ సభ్యులు తల్లులకు తగిన సహకారం అందించాలని కోరారు. బిడ్డ పుట్టినప్పటి నుండి ఆరు నెలల వయసు వచ్చే వరకు వేరే ఏ ఇతర పదార్థాలు లేదా నీళ్లు కూడా ఇవ్వకుండా కేవలం తల్లిపాలు మాత్రమే తాగించాలని సూచించారు. ఈ ఆరు నెలల కాలంలో శిశువు ఆరోగ్యకరమైన ఎదుగుదలకు, సరైన పోషణకు అవసరమైన అన్ని రకాల పోషకాలు తల్లిపాలలోనే పుష్కలంగా లభిస్తాయని వెల్లడించారు. బిడ్డ పుట్టిన వెంటనే తొలిసారిగా వచ్చే ‘ముర్రుపాలు’ బిడ్డ శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచి అనేక రకాల ఆరోగ్య సమస్యల నుంచి రక్షణ కవచంలా కాపాడతాయని వివరించారు.
మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజల ఆలోచనల్లో మార్పు రావలసిన అవసరం ఉందన్న ఆమె, బిడ్డ పుట్టగానే తేనె, పంచదార నీళ్లు నాకించడం వంటి పురాతన మూఢనమ్మకాలను అస్సలు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. ఆరు నెలల వరకు కేవలం తల్లిపాలు మాత్రమే ఇస్తూ, ఆ తర్వాత నుండి మరో సంవత్సరం పాటు అనుబంధ ఆహారంతో పాటు తల్లిపాలు అందించడం ద్వారా తల్లి, బిడ్డలిద్దరూ ఆరోగ్యంగా ఉంటారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం అర్బన్ సీడీపీఓ, అంగన్‌వాడీ సూపర్‌వైజర్లు, పోషణ్ అభియాన్ సిబ్బంది, మహిళా సాధికారిత జిల్లా బృందం, ఆర్టీసీ డిపో మేనేజర్, ఆర్టీసీ సిబ్బంది, బాలింతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Also Read : గుడ్ న్యూస్.. ఏపీ, తెలంగాణకు భారీగా నిధులు విడుదల
Follow Us On: Sharechat

