కలం, వెబ్ డెస్క్ : సోషల్ మీడియా ద్వారా మహిళలతో పరిచయాలు పెంచుకుని, పెళ్లి పేరుతో మోసాలకు పాల్పడిన రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన సబ్-ఇన్‌స్పెక్టర్ కదిరే శ్రీకాంత్ (SI Srikanth)ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని కోర్టులో ప్రవేశపెట్టగా, హనుమకొండ జిల్లా మూడవ అదనపు కోర్టు న్యాయమూర్తి అతనికి 14 రోజుల రిమాండ్ విధించారు.
పోలీసుల వివరాల ప్రకారం, రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలానికి చెందిన వివాహితుడైన ఎస్ఐ శ్రీకాంత్ (SI Srikanth), 2025లో ఫేస్‌బుక్ ద్వారా ఒక మహిళతో పరిచయం పెంచుకున్నాడు. తాను పోలీస్ అధికారినని చెప్పి, ఆమెతో సన్నిహిత సంబంధం ఏర్పరచుకున్నాడు. అనంతరం వరంగల్‌లోని ఆమె నివాసంతో పాటు పలు హోటళ్లకు తీసుకెళ్లి బలవంతంగా లైంగిక దాడులకు పాల్పడ్డాడు. అంతేకాకుండా, బాధితురాలి నగ్న చిత్రాలు తన వద్ద ఉన్నాయని బెదిరిస్తూ డబ్బులు డిమాండ్ చేయడం ప్రారంభించాడు.
శ్రీకాంత్ వేధింపులు భరించలేక బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు కావడంతో అరెస్ట్ భయంతో నిందితుడు గోవా, హైదరాబాద్, నిజామాబాద్ ప్రాంతాల్లో తలదాచుకున్నాడు. జగిత్యాల పోలీస్ స్టేషన్‌లో సైతం ఇతనిపై కేసు నమోదు కాగా, పోలీసులు సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితుడిని నిజామాబాద్‌లో గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. తదుపరి విచారణ కోసం అతడిని హనుమకొండకు తరలించారు.
కాగా, గతంలో హైదరాబాద్‌కు చెందిన మరో యువతిని కూడా పెళ్లి చేసుకుంటానని నమ్మించి శ్రీకాంత్ లైంగిక దాడికి పాల్పడినట్లు విచారణలో తేలింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read : యువతకు అజిత్ దోవల్ కీలక సూచన
Follow Us On: Sharechat

