కలం, ఖమ్మం బ్యూరో: గోదావరి నది భద్రాచలం వద్ద మహోగ్రరూపంతో (Godavari Floods) ప్రవహిస్తోంది. శనివారం ఉదయం 11 గంటల సమయానికి నీటిమట్టం 56.1 అడుగులకు చేరుకోవడంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా ప్రవాహం వస్తుండటంతో ప్రస్తుతం గోదావరిలో 15,96,889 క్యూసెక్కుల వరద ఉధృతి నమోదవుతోంది. భద్రాచలం నుంచి ఒడిశా, ఛత్తీస్‌గఢ్, ఏపీకి రాకపోకలు బంద్ అయ్యాయి. భద్రాచలం పట్టణం లోపలికి వరద రాకుండా మట్టికట్ట ఏర్పాటు చేశారు. పర్ణశాల వద్ద స్నానఘట్టాలు నీటమునిగాయి. దుమ్ముగూడెం-భద్రాచలం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ అంకిత్ శనివారం ఉదయం భద్రాచలం గోదావరి స్నాన ఘాట్లు, కరకట్ట ప్రాంతం, భద్రాచలం–కూనవరం ప్రధాన రహదారి వెంట వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వరద పరిస్థితి తీవ్రంగా ఉన్నందున జిల్లా యంత్రాంగమంతా ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలని, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
లోతట్టు, ముంపు ప్రాంతాల ప్రజలను టామ్‌టామ్, మైకింగ్ ద్వారా నిరంతరం అప్రమత్తం చేయాలని, ఏమాత్రం ఆలస్యం చేయకుండా వారిని సురక్షిత పునరావాస కేంద్రాలకు తరలించాలని స్పష్టం చేశారు. పునరావాస కేంద్రాల్లో బాధితులకు తాగునీరు, నాణ్యమైన భోజనం, పారిశుద్ధ్యం, విద్యుత్, వైద్య సేవలు తక్షణమే అందేలా చర్యలు చేపట్టాలన్నారు. ముఖ్యంగా గర్భిణులు, బాలింతలు, చిన్నారులు, వృద్ధులకు అవసరమైన అన్ని వసతులపై ప్రత్యేక దృష్టి సారించాలని వైద్యాధికారులకు సూచించారు.
మరోవైపు భద్రాచలం–కూనవరం ప్రధాన రహదారిపైకి వరద నీరు చేరుతుండటంతో ఆయా ప్రాంతాల్లో వెంటనే బ్యారికేడ్లు ఏర్పాటు చేసి కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని పోలీసు శాఖను ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించి ప్రజలెవరూ బ్యారికేడ్లను దాటకుండా నిరంతర నిఘా ఉంచాలని, అవసరమైతే అదనపు పోలీసు బలగాలను మోహరించాలని తెలిపారు. గోదావరి నదిలో స్నానాలు చేయడం, ఈత కొట్టడం, వరద నీటిలోకి వెళ్లడం, ప్రమాదకర ప్రాంతాల్లో సెల్ఫీలు తీసుకోవడం, చేపలు పట్టడం, పడవల ప్రయాణాలు చేయడం వంటి చర్యలను పూర్తిగా నిషేధిస్తున్నట్లు హెచ్చరించారు.
ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని తెలిపిన కలెక్టర్, ముంపు ప్రాంత ప్రజలు తమ వెంట అవసరమైన మందులు, తాగునీరు, ముఖ్యమైన పత్రాలను తీసుకుని పునరావాస కేంద్రాలకు సహకరించాలని కోరారు. ప్రజలు ఎటువంటి వదంతులను నమ్మకుండా కేవలం అధికారిక సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని, అత్యవసర సహాయం కోసం జిల్లా 24×7 ఫ్లడ్ కంట్రోల్ రూమ్ నంబర్ 08744-241950 లేదా వాట్సాప్ నంబర్ 9392919743 ను సంప్రదించాలని సూచించారు.

