కలం, వెబ్ డెస్క్: కావేరి జలాల వివాదం (Cauvery Water Dispute) తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల మధ్య మళ్లీ చిచ్చు రేపింది. తమిళనాడుకు 15 రోజుల పాటు రోజుకు 3,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలన్న కావేరి జలాల నిర్వహణ ప్రాధికార సంస్థ (సీడబ్ల్యూఎంఏ) ఆదేశాలను కర్నాటక తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా రైతులు, కన్నడ సంఘాలు ఆందోళనలకు దిగాయి. ఈ ప్రభావం తమిళనాడు సీఎం విజయ్ నటించిన ‘జననాయగన్’ పై కూడా పడింది. పలు థియేటర్లలో ప్రదర్శనలు నిలిచిపోయాయి.
పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ప్రతిపాదిత భేటీ కూడా వాయిదా పడింది.కావేరి జలాల నిర్వహణ ప్రాధికార సంస్థ (సీడబ్ల్యూఎంఏ).. కావేరి జలాల నియంత్రణ కమిటీ (సీడబ్ల్యూఆర్ సీ) సిఫార్సును ఆమోదించిన విషయం తెలిసిందే. దీని ప్రకారం తమిళనాడుకు నీటిని విడుదల చేయాల్సి ఉంది. ఈ నిర్ణయాన్ని కర్నాటక ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు తమిళనాడుకు చెందిన కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం మాత్రం కావేరి నిర్వహణ బోర్డు నిర్ణయాలను పూర్తిగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. బోర్డు ఇచ్చిన ఆదేశాలను అన్ని రాష్ట్రాలు తప్పనిసరిగా పాటించాల్సిందేనని స్పష్టం చేశారు.
వివాదం ఏమిటి?
కావేరి జలవివాదానికి ప్రధాన కారణం కావేరి జల నిర్వహణ అథారిటీ (సీడబ్ల్యూఎంఏ) ఇటీవల కర్నాటక ప్రభుత్వానికి జారీ చేసిన ఆదేశాలే. సీడబ్ల్యూఎంఏ సమావేశంలో, కావేరి జల నియంత్రణ కమిటీ (సీడబ్ల్యూఆర్సీ) సిఫార్సులను ఆమోదించారు. తమిళనాడుకు రోజుకు 3,500 క్యూసెక్కుల చొప్పున 15 రోజుల పాటు మొత్తం 4 టీఎంసీల నీటిని విడుదల చేయాలని కర్నాటక ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ఆదేశాలను కర్నాటక సర్కారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది.
రాష్ట్రంలో వర్షపాతం ఆశించిన స్థాయిలో లేకపోవడంతో జలాశయాల్లో నీటి నిల్వలు తక్కువగా ఉన్నాయని, ప్రస్తుతం తాగునీటి అవసరాలు, రైతుల సాగునీటి అవసరాలకే జలాలు సరిపోతాయని వాదిస్తున్నది. తమిళనాడు మాత్రం కావేరి ట్రిబ్యునల్, సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం తనకు కేటాయించిన నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నది. నీటి విడుదలలో ఆలస్యం వల్ల డెల్టా ప్రాంతంలో కరువు ఏర్పడి పంటలు దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తం చేస్తోంది.
మేకేదాటు రిజర్వాయర్ వివాదం
కర్నాటక ప్రభుత్వం ప్రతిపాదించిన మేకేదాటు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్-కమ్-తాగునీటి ప్రాజెక్టు మరో వివాదానికి దారితీసింది. ఈ ప్రాజెక్టు వల్ల కావేరి డెల్టాకు నీటి ప్రవాహం తగ్గే అవకాశం ఉందని తమిళనాడు ప్రభుత్వం, రైతు సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టు డీపీఆర్‌ను సవరణల కోసం తిరిగి పంపింది. దీంతో వివాదం మరింత ముదిరింది.
డీకే ఉన్నతస్థాయి సమావేశం
కావేరి జలవివాదం తీవ్రరూపం దాల్చడంతో కర్నాటక సీఎం డీకే శివకుమార్ శుక్రవారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. కావేరి జలాల విడుదలపై ఇటీవల కావేరి జల నిర్వహణ అథారిటీ (సీడబ్ల్యూఎంఏ) జారీ చేసిన ఆదేశాల నేపథ్యంలో పరిస్థితిని సమీక్షించారు. బెంగళూరులో జరిగిన ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి జీ పరమేశ్వర, జలవనరుల శాఖ మంత్రి రామలింగారెడ్డి, ప్రధాన కార్యదర్శి షాలినీ రజనీష్, డీజీపీ సలీం అహ్మద్‌తోపాటు పలువురు ఉన్నతాధికారులు, పోలీసు అధికారులు పాల్గొన్నారు.
జలవివాదానికి 130 ఏళ్ల చరిత్ర
దక్షిణ భారతదేశంలో అంతర్రాష్ట్ర జల వివాదాల్లో కావేరి ప్రధానమైనది. ఈ వివాదానికి 130 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. 1892లో అప్పటి మద్రాస్ ప్రెసిడెన్సీ, మైసూరు సంస్థానం మధ్య కుదిరిన ఒప్పందంతో వివాదం మొదలైంది. అనంతరం 1924లో కుదిరిన కీలక ఒప్పందంతో వివాదం మరింత ముదిరింది. 1892 ఒప్పందం ప్రకారం ఎగువన ఉన్న మైసూరు సంస్థానం కావేరి నదిపై కొత్త సాగునీటి ప్రాజెక్టులు చేపట్టాలంటే దిగువన ఉన్న మద్రాస్ ప్రెసిడెన్సీ అనుమతి తీసుకోవాల్సి ఉండేది. 1924లో బ్రిటిష్ ప్రభుత్వం మధ్యవర్తిత్వంతో మరో ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం మైసూరుకు కృష్ణరాజసాగర్ (కేఆర్ఎస్) ఆనకట్ట నిర్మించేందుకు, మద్రాస్‌కు మెట్టూరు ఆనకట్ట నిర్మించేందుకు అవకాశం కల్పించారు. ఈ ఒప్పందాన్ని 50 సంవత్సరాల పాటు అమలు చేయాలని నిర్ణయించారు.
కొత్త ప్రాజెక్టులు కట్టడంపై అభ్యంతరం
బ్రిటిష్ ప్రభుత్వంలో కుదిరిన ఒప్పందం 1974లో ముగింది. ఒప్పందం ముగిశాక కర్నాటక కొత్త సాగునీటి ప్రాజెక్టులు చేపట్టగా, తమిళనాడు అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో కావేరి జలాల పంపిణీపై వివాదం తీవ్రరూపం దాల్చింది. వివాదం పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వం 1990లో కావేరి జల వివాద ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేసింది. 1991లో ట్రిబ్యునల్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయగా, కర్నాటక, తమిళనాడులో భారీగా నిరసనలు జరిగాయి. అనంతరం 2007లో ట్రిబ్యునల్ తుది తీర్పు ఇచ్చి కర్నాటక, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి మధ్య నీటి పంపిణీని నిర్ణయించింది.
ట్రిబ్యునల్ తీర్పుపై దాఖలైన పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు 2018లో తుది తీర్పు వెలువరించింది. కర్నాటకకు కొంత అదనపు నీటిని కేటాయిస్తూ, కావేరి జలాల నిర్వహణ కోసం కేంద్ర ప్రభుత్వం కావేరి వాటర్ మేనేజ్మెంట్ అథారిటీ (సీడబ్ల్యూఎంఏ)ని ఏర్పాటు చేయాలని ఆదేశించింది. అప్పటి నుంచి ఈ అథారిటీ పర్యవేక్షణలో ప్రతి ఏడాది వర్షపాతం, జలాశయాల్లో నీటి నిల్వల ఆధారంగా రాష్ట్రాలకు నీటి విడుదలపై నిర్ణయాలు తీసుకుంటున్నది.
సీఎంల భేటీ వాయిదా!
కావేరి జలవివాదంపై ముఖాముఖి సమావేశంలో చర్చించాలని తమిళనాడు సీఎం విజయ్, కర్నాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ భావించారు. ఆగస్టు 3న బెంగళూరులో భేటీ కావాలని భావించారు. అయితే తాజా కావేరి జల వివాదం, కర్నాటకలో కొనసాగుతున్న నిరసనల నేపథ్యంలో ప్రస్తుతం సమావేశం నిర్వహించడం సాధ్యం కాదని డీకే శివకుమార్ తేల్చి చెప్పారు. ఈ భేటీని వాయిదా వేయాలని విజయ్ ని కోరారు. పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చిన తర్వాత సమావేశానికి కొత్త తేదీ ఖరారు చేయనున్నట్లు సమాచారం.
వివాదానికి పరిష్కారం లేదా?
తమిళనాడుకు నీటి విడుదలపై సీడబ్ల్యూఎంఏ ఆదేశాలతో కావేరి జలవివాదం మళ్లీ ఉధృతమైంది. కర్నాటకలో నిరసనల ప్రభావంతో విజయ్ నటించిన ‘జననాయకన్’ సినిమా ప్రదర్శనలు పలు థియేటర్లలో నిలిచిపోయాయి. 1892లో ప్రారంభమైన కావేరి జలవివాదం 130 ఏళ్లుగా కొనసాగుతూ ఇప్పటికీ తరచూ ఉద్రిక్తతలకు దారితీస్తున్నది.

