కలం, వరంగల్ బ్యూరో : నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి (Peddi Sudarshan Reddy) పార్థివ దేహానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు ఘనంగా నివాళులర్పించారు. నర్సంపేటలోని ఆయన స్వగృహం నల్లబెల్లికి చేరుకున్న ఇద్దరు నేతలు పెద్ది పార్థివ దేహంపై బీఆర్ఎస్ పార్టీ జెండా కప్పి చివరి వీడ్కోలు పలికారు. అనంతరం పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. భార్య స్వప్నను ఓదారుస్తూ ధైర్యంగా ఉండాలని, పార్టీ ఎల్లప్పుడూ కుటుంబానికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
కుటుంబ సభ్యులతో మాట్లాడి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా అక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్న పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ది సుదర్శన్ రెడ్డి పార్థివ దేహానికి పుష్పాంజలి ఘటించి అశ్రునయనాలతో నివాళులర్పించారు. తెలంగాణ ఉద్యమం నుంచి బీఆర్ఎస్ పార్టీ బలోపేతం వరకు పెద్ది సుదర్శన్ రెడ్డి చేసిన సేవలు చిరస్మరణీయమని నాయకులు కొనియాడారు. ఆయన మృతితో పార్టీ ఓ నిబద్ధత కలిగిన నాయకుడిని కోల్పోయిందని, నర్సంపేట నియోజకవర్గ ప్రజలు ఆప్త నాయకుడిని కోల్పోయారని వారు పేర్కొన్నారు.
కేసీఆర్ తప్ప కదిలి వచ్చిన బీఆర్ఎస్..!
పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ సీఎం కేసీఆర్ మినహా బీఆర్ఎస్ అగ్రనేతలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున నర్సంపేటకు చేరుకుని పెద్ది సుదర్శన్ రెడ్డికి తుది నివాళులర్పించారు.

