కలం, వెబ్ డెస్క్ : దేశ జీడీపీలో తెలంగాణ వాటా 5 శాతం నుంచి 10 శాతానికి పెంచడమే లక్ష్యం పెట్టుకున్నామని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. సీఐఐ ప్రతినిధులతో సమావేశం అయిన రేవంత్ రెడ్డి తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, 2047 నాటికి దేశ జీడీపీలో తెలంగాణ వాటా 10 శాతం పెంచడమే ధ్యేయంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. తెలంగాణ పెట్టుబడులకు గమ్యస్థానంగా ఉందని.. సొంత రాష్ట్రంగా భావించి ఇక్కడ పెట్టుబడులు పెట్టాలని సీఎం సీఐఐ ప్రతినిధులను కోరారు.
రాష్ట్రం పెట్టుబడులకు సురక్షితమైన గమ్య స్థానంగా ఉందని చెప్పారు. ఫ్యూచర్ సిటీ నుంచి మచిలీపట్నం పోర్టు వరకు 12 లైన్ల రహదారి నిర్మిస్తామని తెలిపారు. అలాగే, వరంగల్, ఆదిలాబాద్ విమానాశ్రయాలను నిర్మాణానికి కేంద్రం అనుమతించిన విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. రాష్ట్రంలో వివిధ రకాల పరిశ్రమల క్లస్టర్లను ఏర్పాటు చేస్తామని చెప్పిన సీఎం.. హైదరాబాద్ లోని పరిశ్రమలను ప్యూర్ (PURE) ప్రాంతానికి తరలించనున్నట్లు వెల్లడించారు.

