కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ నగరంలో రూ.180 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనుల టెండర్ ప్రక్రియపై బీఆర్ఎస్ నేత మాజీ మేయర్ రవీందర్ సింగ్ (Ravinder Singh) సంచలన ఆరోపణలు చేశారు. ఈ టెండర్ వ్యవహారంలో రూ.40 – 50 కోట్ల వరకు చేతులు మారాయనే అనుమానాలు ఉన్నాయని, కేవలం కమిషన్ల కోసమే కాంట్రాక్టర్లకు అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయని అన్నారు.
ప్రజల అవసరాల కోసం చేపట్టాల్సిన భారీ ప్రాజెక్టును కాంట్రాక్టర్ల ప్రయోజనాల కోసం ఉపయోగించవద్దని డిమాండ్ చేశారు. కరీంనగర్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. భూగర్భ మురుగునీటి వ్యవస్థ కోసం ప్రభుత్వం జీవో నంబర్-745 ద్వారా రూ.180 కోట్ల నిధులు కేటాయించిందని, ఇంత భారీ మొత్తంలో ప్రజాధనం ఖర్చు చేస్తున్నప్పుడు టెండర్ ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా ఉండాలని అన్నారు. అయితే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు అనేక అనుమానాలకు తావిస్తున్నాయని పేర్కొన్నారు.
రద్దైన అదనపు టెండర్.. మళ్లీ అదే కాంట్రాక్టర్‌కే ఎలా?
అదనపు (ఎక్సెస్) టెండర్‌ను రద్దు చేసి.. మళ్లీ అదే కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించడం వెనుక ఆంతర్యమేంటని రవీందర్ సింగ్ ప్రశ్నించారు. అదనపు టెండర్‌ను రద్దు చేయడానికి బలమైన కారణం ఉండాలని, నిబంధనల ప్రకారం తగిన అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు. కేవలం 5 శాతం అదనపు ధర పేరుతో టెండర్ ప్రక్రియను మార్చి, తిరిగి అదే కాంట్రాక్టర్‌కు పనులు కట్టబెట్టడం వెనుక అసలు కారణాలను ప్రభుత్వం వెల్లడించాలని డిమాండ్ చేశారు.
రూ.50 లక్షల పనులకు ఒక నిబంధన.. రూ.180 కోట్ల పనులకు మరో నిబంధనా?” అని ప్రశ్నించారు. ఇటీవల రూ.50 లక్షల విలువైన పనుల్లో అదనపు ధర కారణంగా జిల్లా కలెక్టర్ టెండర్‌ను రద్దు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అదే నిబంధన భారీ విలువైన భూగర్భ మురుగునీటి టెండర్‌కు ఎందుకు వర్తించదని నిలదీశారు. టెండర్ వ్యవహారంలో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే కమిషన్ల కోసం కాంట్రాక్టర్లకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే అనుమానం కలుగుతోందని అన్నారు.
సమగ్ర విచారణ జరిపించాలి..
రూ.40–50 కోట్ల వరకు చేతులు మారాయనే అనుమానాలపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించి వాస్తవాలను ప్రజల ముందుంచాలని డిమాండ్ చేశారు. గతంలో ఇదే సంస్థపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఫిర్యాదు చేశారని, ఇప్పుడు అదే సంస్థకు మళ్లీ భారీ విలువైన టెండర్ ఎలా దక్కిందని ప్రశ్నించారు. అప్పట్లో చేసిన ఆరోపణలు నిజమా? కాదా? అన్నది ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.
కరీంనగర్ నగరంలో జరుగుతున్న టెండర్ వ్యవహారాలపై కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య కుమ్మక్కు ఉందనే అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయని అన్నారు. ఇప్పటికే ఉన్న శుద్ధి కేంద్రాలు, మురుగునీటి వ్యవస్థ, స్మార్ట్ సిటీ పనులను పూర్తిగా పరిశీలించకుండా రూ.180 కోట్ల భూగర్భ మురుగునీటి ప్రాజెక్టు చేపట్టడం వల్ల ప్రయోజనం ఏమిటి? గతంలో చేసిన పనుల పరిస్థితిని చూడకుండా కొత్త పనులు చేపట్టడం ఎందుకు? అని ప్రశ్నించారు.

