కలం, మెదక్ బ్యూరో: ఇంజనీరింగ్ విద్యార్థులను “క్రిమినల్ వేస్ట్”గా పేర్కొనడం, అప్లికేషన్‌లు కూడా నింపడం రాదని వ్యాఖ్యానించడం ద్వారా.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులను కూడా తీవ్రంగా అవమానించారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) విమర్శించారు. ఆ వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని ఇంజనీరింగ్ విద్యార్థులు, ఉపాధ్యాయులకు సీఎం బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానం (OPS)ను పునరుద్ధరించాలని కోరుతూ సిద్ధిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో సీపీఎస్ ఉద్యోగులు చేపట్టిన నిరసన కార్యక్రమానికి హరీశ్ రావు హాజరై సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో ప్రభుత్వ ఉద్యోగులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలలో ఒక్కదాన్నీ అమలు చేయలేదని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని హామీలను పక్కన పెట్టారని విమర్శించారు. పిల్లల ముందే రాజకీయ వ్యాఖ్యలు చేయడం సరికాదని, ముఖ్యమంత్రి ఎక్కడ ఏం మాట్లాడాలో తెలుసుకోవాలని హితవు పలికారు. ఉద్యోగులతో విభేదించిన ఏ ప్రభుత్వం కూడా చరిత్రలో నిలవలేదని పేర్కొన్నారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లకు బీఆర్ఎస్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, త్వరలో హైదరాబాద్‌లో నిర్వహించనున్న ఉద్యోగుల మహా ఆందోళనకు కూడా తమ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని హరీశ్ రావు స్పష్టం చేశారు.

