కలం, జోగులాంబ గద్వాల: ఎల్‌నినో ప్రభావం కారణంగా ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు సూచిస్తున్న నేపథ్యంలో జిల్లా (Jogulamba Gadwal) రైతులు పంటల ఎంపికలో అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నప్పటికీ, రైతులు వరి సాగు విషయంలో జాగ్రత్తలు పాటించాలని, నీటి లభ్యత తక్కువగా ఉండే చోట ఆరుతడి పంటలు సాగు చేయాలన్నారు. బోర్లు, బావులు, ఇతర వనరుల ద్వారా పంట కాలమంతా భరోసా కలిగిన నీటి లభ్యత ఉన్న రైతులు మాత్రమే వరి సాగు చేపట్టాలని తెలిపారు.
తగినంత నీటి వనరులు లేని రైతులు వరి సాగుకు బదులుగా తక్కువ నీటితో సాగయ్యే ఆరుతడి పంటలను ఎంచుకోవడం ద్వారా నష్టాలను నివారించవచ్చన్నారు. రైతులు తమ వ్యవసాయ క్షేత్రాల్లో పంట కుంటలను నిర్మించుకోవాలని, ఫలితంగా వర్షాలు మందగించినప్పుడు నీటి కుంటల్లో నిలువ చేసుకున్న నీళ్లను పంటలకు పారించుకోవచ్చన్నారు. జిల్లాలో కూరగాయల సాగుతో పాటు ఆయిల్ పామ్ తోటల విస్తీర్ణాన్ని పెంచాల్సిన అవసరం ఉందన్నారు.
ఆయిల్ పామ్ పంటల సాగుకు ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నందున రైతుల సద్వినియోగం చేసుకోవాలన్నారు. వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ, వ్యవసాయ శాఖ అధికారుల సలహాలు, సూచనలను అనుసరించి పంటల ఎంపిక చేసుకోవాలని రైతులకు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.

