కలం, మహబూబ్ నగర్ బ్యూరో : అందరికీ ఉచిత విద్య అందుతుందనే ఆశతోని తెలంగాణ ఉద్యమం నడిచిందని తెలంగాణ ఉద్యమకారుడు, సామాజికవేత్త హనీఫ్ అహ్మద్ అన్నారు. మన పేద పిల్లలకు ఫీజు రీయింబర్స్మెంట్ (Fee Reimbursement ) అనేది సర్కారు ఇచ్చే దానం కాదు, అది రాజ్యాంగం ఇచ్చిన హక్కు అంటూ గురువారం ఆయన ఒక పత్రిక ప్రకటన విడుదల చేశారు.
గతంలో ఉన్న పాలకులు చదువును, ఉద్యోగాలను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. అయితే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కూడా అదే రీతిలో విద్యను ఉద్యోగాల భర్తీని పక్కన పెట్టడం ఏమాత్రం తగదన్నారు.గత రెండున్నర ఏండ్లుగా ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు సరిగా ఇవ్వకపోవడం వల్ల వేల కోట్ల బకాయిలు పేరుకుపోయాయని ఆరోపించారు. దీనివల్ల ప్రైవేట్ కాలేజీల వాళ్లు ముందు పైసలు కడితేనే సీటు ఇస్తాం అని మొండికేస్తు విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఫలితంగా పేద, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ పిల్లలు చదువుకు దూరమైపోతున్నారన్నారు.
ఇంకో పెద్ద సమస్య ఏంటంటే కోర్సులు పూర్తయినా కూడా ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వకుండా ప్రైవేట్ కాలేజీలు ఆపేస్తున్నాయని, ఇది చట్టప్రకారం తీవ్రమైన నేరమని ఆయన తెలిపారు.సర్టిఫికెట్లు రాక పిల్లల భవిష్యత్తు పాడవుతుంటే, కాలేజీల వేధింపులు తట్టుకోలేక పేద తల్లిదండ్రులు నరకం చూస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి, పిల్లల జీవితాలతో ఆడుకుంటున్న ఆ ప్రైవేట్ యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకునేలా జీవో ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. వెంటనే బడ్జెట్ నిధులు కేటాయించి, పేరుకుపోయిన బకాయిలన్నీ విడుదల చేయాలన్నారు. పేద విద్యార్థుల హక్కులను, తెలంగాణ విద్యా రంగాన్ని కాపాడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని ఆయన తెలిపారు.
Read Also: ఆ పార్టీలో చేరాలని బెదిరిస్తున్నారు.. అభిజీత్ సంచలన ఆరోపణలు
Follow Us On : WhatsApp

