కలం, ఖమ్మం బ్యూరో: మత్స్యకారుల జీవనోపాధి మెరుగుదల, ఆదాయ వృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం మంజూరు చేసిన ద్విచక్ర, మూడు చక్రాల వాహనాల లబ్ధిదారులను పారదర్శక లాటరీ విధానంలో ఎంపిక చేశారు. ఐడీఓసీ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ అంకిత్(Collector Ankit), ఐఏఎస్ అధ్యక్షతన ప్రధాన మంత్రి జనజాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్ పథకం కింద పీఎంఎంఎస్వై జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ ఎంపిక ప్రక్రియ నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా అర్హులైన ప్రతి మత్స్యకారుడికి సంక్షేమ ఫలాలు అందేలా జవాబుదారీతనంతో లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేసినట్లు తెలిపారు. జిల్లా మత్స్యశాఖ అధికారి జి. శివ ప్రసాద్ మాట్లాడుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు 51 ద్విచక్ర వాహనాలు, 12 మూడు చక్రాల వాహనాలు మంజూరయ్యాయని తెలిపారు. ఈ వాహనాల కోసం మొత్తం 300 దరఖాస్తులు వచ్చాయని, కేటాయించిన వాహనాల సంఖ్య కంటే దరఖాస్తులు ఎక్కువగా ఉండటంతో మత్స్యకార సంఘాల ప్రతినిధులు, దరఖాస్తుదారుల సమక్షంలో లాటరీ నిర్వహించి తుది జాబితాను సిద్ధం చేసినట్లు వివరించారు. ఎంపికైన లబ్ధిదారులకు త్వరలోనే వాహనాలను పంపిణీ చేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు జిల్లా అధికారులు, మత్స్యకార సంఘాల నాయకులు పాల్గొన్నారు.

