కలం, స్పోర్ట్స్: శ్రీలంకతో జరగబోయే రెండు టెస్టుల సిరీస్ కోసం భారత జట్టును ప్రకటించారు. అయితే, ఈ 15 మంది సభ్యుల జట్టులో యంగ్ పేసర్ ఆకిబ్ నబీకి చోటు దక్కలేదు. 4 మంది స్పెషలిస్ట్ పేసర్లను తీసుకున్నా, లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేయగల నబీని పక్కన పెట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీమిండియా మాజీ అసిస్టెంట్ మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ (Irfan Pathan) ఈ ఎంపికపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
29 ఏళ్ల ఆకిబ్ నబీ దేశవాళీ క్రికెట్‌లో అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. 2025/26 రంజీ ట్రోఫీలో 10 మ్యాచ్‌ల్లో కేవలం 12.56 సగటుతో 60 వికెట్లు తీసి అత్యధిక వికెట్ల వీరుడిగా నిలిచాడు. ఇతని దెబ్బకు జమ్మూ కాశ్మీర్ జట్టు తొలిసారి రంజీ ట్రోఫీ టైటిల్‌ను గెలుచుకుంది. ఫైనల్లో బలమైన కర్ణాటక జట్టుపై 5 వికెట్లు తీసి మెరిశాడు. కెరీర్‌లో 43 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 162 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 15 సార్లు ఐదేసి వికెట్లు తీయడం విశేషం.
ఒక స్పోర్ట్స్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పఠాన్ మాట్లాడుతూ.. నబీని ఎంపిక చేయకపోవడానికి ఎలాంటి లాజిక్ కనిపించడం లేదన్నారు. దేశవాళీ మ్యాచ్‌ల్లో దిగ్గజ బ్యాటర్లను సైతం నబీ ఇబ్బంది పెట్టాడని చెప్పారు. రంజీ ఫైనల్లో కేఎల్ రాహుల్‌ను కూడా నబీ ఇబ్బంది పెట్టిన విషయాన్ని గుర్తుచేశారు. ఫామ్‌లో ఉన్న వేగవంతమైన బౌలర్‌ను జట్టులోకి తీసుకోకుండా ఆలస్యం చేస్తే ఆటగాడి నైపుణ్యాన్ని జట్టు కోల్పోతుందని హెచ్చరించారు.
సాధారణంగా పేసర్లు 27 నుంచి 32 ఏళ్ల వయసులో అత్యుత్తమ ప్రదర్శన ఇస్తారని, ఆ కాలాన్ని వృథా చేయకూడదని అభిప్రాయపడ్డారు. గత నెలలో ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌లో నబీని ఆడించకపోవడాన్ని కూడా పఠాన్ తప్పుబట్టారు. చండీగఢ్‌లో జరిగిన ఆ మ్యాచ్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భాగం కాదని గుర్తుచేశారు.
బుమ్రా లేనప్పుడు సిరాజ్ ప్రధాన బౌలర్‌గా ఉంటాడని, అలాంటి మ్యాచ్‌లో సిరాజ్‌ను ఆడించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. దేశవాళీ ప్రదర్శనకు విలువ ఇస్తే, నబీకి ఆ మ్యాచ్‌లో అవకాశం ఇచ్చి పరీక్షించాల్సిందని అన్నారు. కాగా, భారత్ ఆ మ్యాచ్‌ను ఇన్నింగ్స్ 300 పరుగుల తేడాతో గెలవగా, సిరాజ్ కేవలం 13 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశాడు.

