కలం, ఖమ్మం బ్యూరో: జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా (LG Manoj Sinha) ఖమ్మం (Khammam) జిల్లా పర్యటన స్థానికంగా ఆసక్తిని రేకెత్తించింది. బుధవారం అధికారిక పర్యటనలో భాగంగా ఖమ్మం చేరుకున్న ఆయనకు జిల్లా యంత్రాంగం ఘన స్వాగతం పలికింది. ఎన్‌ఎస్‌పీ అతిథి గృహం వద్ద జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ పుష్పగుచ్ఛం అందించి ఎల్జీ మనోజ్ సిన్హాను మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు.
అనంతరం అతిథి గృహ ప్రాంగణంలో పోలీసు బలగాలు ఏర్పాటు చేసిన ప్రత్యేక గౌరవ వందనాన్ని లెఫ్టినెంట్ గవర్నర్ స్వీకరించారు. ఈ సందర్భంగా ఎన్‌ఎస్‌పీ అతిథి గృహంలో పలువురు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు ఎల్జీని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. పోలీస్ కమిషనర్ సునీల్ దత్, అదనపు కలెక్టర్ పి. శ్రీనివాసరెడ్డి, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ పారస్ కుమార్ తదితరులు ఆయనను కలిశారు.
అనంతరం జరిగిన ప్రత్యేక సమావేశంలో జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ ఖమ్మం జిల్లా అభివృద్ధి, భౌగోళిక పరిస్థితులపై ఎల్జీ (LG Manoj Sinha)కి వివరించారు. వ్యవసాయం, పారిశ్రామిక రంగం, సాగునీటి ప్రాజెక్టులు, విద్య, వైద్య రంగాలతో పాటు మౌలిక వసతుల అభివృద్ధిలో జిల్లా సాధించిన పురోగతిని వివరించారు. సంక్షేమ పథకాల అమలు, పెట్టుబడుల ప్రోత్సాహానికి జిల్లాలో ఉన్న అవకాశాలు, వివిధ శాఖల సమన్వయంతో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను కలెక్టర్ వివరించారు.
ఖమ్మం జిల్లా ప్రజలు, అధికారుల ఆతిథ్యంపై జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా హర్షం వ్యక్తం చేశారు. ఖమ్మం పర్యటన ముగించుకున్న అనంతరం ఆయన తదుపరి కార్యక్రమాల నిమిత్తం హైదరాబాద్‌కు బయలుదేరారు. ఈ పర్యటనలో జిల్లా యంత్రాంగం అధికారులు, పోలీసు సిబ్బంది, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Read Also: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల
Follow Us On : WhatsApp

