కలం, యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట (Yadagirigutta) శ్రీ షిరిడీ సాయిబాబా ఆలయంలో వ్యాస గురు పౌర్ణమి వేడుకలు (Guru Purnima Celebrations) భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహిస్తున్నారు. తెల్లవారుజాము నుంచే ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు, కాకాడ హారతి, పల్లకీ సేవలు నిర్వహించారు. గురుపౌర్ణమి సందర్భంగా సాయినాథుడికి పంచామృతాలతో పాటు 108 లీటర్ల పాలతో ప్రత్యేక అభిషేకం చేశారు.
అనంతరం ప్రత్యేక భజనలు, సాయి నామ సంకీర్తనలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని సాయిబాబాను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ కార్యనిర్వహణ, ప్రధాన అర్చకులు ఆరుట్ల రాఘవచార్యులు మాట్లాడుతూ.. గురుపౌర్ణమి సందర్భంగా శ్రీ సద్గురు సాయినాథుడిని దర్శించుకుని భక్తులు ఆశీస్సులు పొందాలని తెలిపారు. భక్తుల కోసం ప్రత్యేక పూజా కార్యక్రమాలు, సేవలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
యాదగిరిగుట్ట (Yadagirigutta) పట్టణంలోని పాతగుట్ట రోడ్డులో ఉన్న శ్రీ షిరిడీ సాయిబాబా చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో గురుపౌర్ణమి వేడుకలు వైభవంగా కొనసాగాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గురువుకు సమాజంలో అత్యున్నత స్థానం ఇవ్వడం భారతీయ సంప్రదాయంలో భాగమని, గురువును బ్రహ్మ, విష్ణు, మహేశ్వర స్వరూపంగా పూజిస్తారని భక్తులు తెలిపారు.
అజ్ఞానాంధకారాన్ని తొలగించి జ్ఞాన వెలుగులు ప్రసాదించే వ్యక్తే గురువు అని పేర్కొన్నారు. ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమిని గురుపౌర్ణమిగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. వేదాలను రచించిన వ్యాస మహర్షి జన్మదినంగా ఈ రోజును భావిస్తారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ గుండ్లపల్లి వాణి భారత్ గౌడ్, కౌన్సిలర్ బబ్బురి శ్రీధర్ గౌడ్, నాయకులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
హైదరాబాద్‌కు చెందిన సాయిబాబా భక్తుడు బంగారం రాజు మాట్లాడుతూ.. గత 15 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం వ్యాస గురుపౌర్ణమి సందర్భంగా ఆరుట్ల రాఘవచార్యుల ఆశీస్సులతో యాదాద్రి షిరిడీ సాయినాథుడి క్షేత్రాన్ని సందర్శిస్తున్నట్లు తెలిపారు. సాయినాథుడి అనుగ్రహంతో తాను కోరుకున్న కోరికలు, అనుకున్న పనులు సకాలంలో నెరవేరాయని పేర్కొన్నారు. గురుపౌర్ణమి సందర్భంగా ప్రతి ఏడాది అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా సాయినాథుని క్షేత్రంలో గురుదత్త స్వామి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని కూడా తన సొంత ఖర్చులతో చేపట్టినట్లు వెల్లడించారు.
Read Also: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల
Follow Us On: X(Twitter)

