కలం, మహబూబ్ నగర్ బ్యూరో : జూరాల కుడి, ఎడమ ప్రధాన కాలువలకు నీటిని విడుదల చేయకుంటే పోరుబాట పోరుబాట తప్పదని బీఆర్ఎస్ మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud) హెచ్చరించారు. జూరాల ప్రాజెక్టుకు గత నాలుగు రోజులుగా భారీ వరద ప్రవాహం నమోదవుతున్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం పాలమూరు రైతుల ప్రయోజనాలను పూర్తిగా విస్మరించిందని ప్రకటనలో విమర్శించారు.
ప్రస్తుతం జూరాల ప్రాజెక్టులో (Jurala Project) 7.12 టీఎంసీల నీటి నిల్వ ఉండగా, సుమారు 20,000 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతోందన్నారు. అయినప్పటికీ వచ్చిన నీటిని జూరాల కుడి, ఎడమ ప్రధాన కాలువలకు విడుదల చేయకుండా, విద్యుత్ ఉత్పత్తి పేరుతో దిగువకు విడుదల చేస్తుందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం పాలమూరు రైతుల అవసరాలను పక్కనపెట్టి శ్రీశైలానికి నీటిని విడుదల చేస్తుందని శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు.
తద్వారా ఆ నీరు పోతిరెడ్డిపాడు ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లే మార్గాన్ని రేవంత్ రెడ్డి సుగమం చేశాడని విమర్శించారు. జూరాల కుడి, ఎడమ ప్రధాన కాలువలకు నీటిని విడుదల చేసి పాలమూరు రైతుల సాగు అవసరాలను తీర్చాలని డిమాండ్ చేశారు. కాలువలకు నీటిని విడుదల చేయకపోతే రైతులతో కలిసి జూరాల ప్రాజెక్టును ముట్టడించి, ఉద్యమాన్ని ప్రారంభిస్తామని శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud) హెచ్చరించారు.
Read Also: స్వర్ణ ప్రాజెక్టు గేటు మొరాయింపు.. తాళ్లతో కట్టిన అధికారులు
Follow Us On : WhatsApp

