కలం, వెబ్ డెస్క్: ఏపీ అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ మధ్య సమతుల్యత ఉన్నప్పుడే రాష్ట్ర స్థిరమైన ప్రగతి సాధ్యమవుతుందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రజల భద్రతతోపాటు వన్యప్రాణుల సంరక్షణపైనా కూటమి ప్రభుత్వానికి బాధ్యత ఉందని పేర్కొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలం గుచ్చిమిలో ఏర్పాటు చేసిన కుంకీ ఏనుగుల (Kumki Elephant) శిబిరాన్ని బుధవారం వర్చువల్ గా ఆయన ప్రారంభించారు.
మానవ, ఏనుగు సంఘర్షణలను తగ్గించడానికి గుచ్చిమి ఎలిఫెంట్ క్యాంప్‌ను ఏర్పాటు చేశామని పవన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు, మంత్రి సంధ్యారాణి పాల్గొన్నారు. అడవి ఏనుగుల సంచారాన్ని నియంత్రించడం, ప్రజల ప్రాణాలు, రైతుల పంటల రక్షణ, దశాబ్దాల నుంచి ఉన్న మానవ-ఏనుగు సంఘర్షణను నివారించడమే లక్ష్యంగా ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం (Pawan Kalyan) మాట్లాడుతూ.. అటవీ ప్రాంతం నుంచి ఏనుగులు గ్రామాల్లోకి ప్రవేశించడం, పంటలు ధ్వంసం చేయడంతో ప్రజలు భయాందోళనల నడుమ జీవించడం వంటి సమస్యలు పార్వతీపురం మన్యం జిల్లాలో చాలా కాలంగా కొనసాగుతున్నాయని చెప్పారు. ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్నప్పుడు పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ, కొంత మంది స్థానిక ప్రజలు సమస్యను తన దృష్టికి తీసుకొచ్చారని అన్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడం ప్రభుత్వ బాధ్యతగా భావించి గుచ్చిమి ఎలిఫెంట్ హోల్డింగ్ ఏరియాను ఏర్పాటు చేశామని తెలిపారు.
ఏపీకి ఏనుగులు ఇచ్చిన కర్ణాటక ప్రజలు, ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా పవన్ కల్యాణ్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కు, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు, అప్పటి అటవీశాఖ మంత్రి, ప్రస్తుత పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రేకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
Read Also: ఏపీలో మరో రాష్ట్ర విభజన.. మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు!
Follow Us On : WhatsApp

