కలం, వనపర్తి: సాంప్రదాయ పంటలతో పాటు పండ్ల తోటలు, వాణిజ్య పంటల సాగుపై రైతులు దృష్టి సారించాలని మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి సూచించారు. అమరిచింత (Amarchinta) మండలం చిన్నకడుమూరు గ్రామానికి చెందిన దాసరిపల్లి ఆశిరెడ్డి సాగు చేస్తున్న 10 ఎకరాల మేలురకం దానిమ్మ తోటను బుధవారం ఆయన సందర్శించారు.
ఈ సందర్భంగా నిరంజన్‌రెడ్డి (Singireddy Niranjan Reddy) మాట్లాడుతూ, సంప్రదాయ పంటలతో పాటు వాణిజ్య పంటలపై ఆసక్తి కనబరుస్తూ 10 ఎకరాల్లో దానిమ్మ సాగు చేసి ఏటా రూ.1.20 కోట్ల విలువైన దిగుబడి సాధించడం అభినందనీయమన్నారు. ఆశిరెడ్డి ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు. ఆశిరెడ్డి కుమారులు ఇద్దరూ వైద్యులైనా వ్యవసాయంపై ఆసక్తి చూపుతూ ఆధునిక సాగు పద్ధతులతో మంచి ఫలితాలు సాధించడం యువతకు స్ఫూర్తిదాయకమన్నారు. తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం వచ్చే వాణిజ్య పంటల సాగుపై రైతులు దృష్టి సారించాలని సూచించారు.
తాను వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఆయిల్‌పామ్ సాగును (Oil Palm Cultivation) రెండు లక్షల ఎకరాలకు విస్తరింపజేసి ప్రత్యామ్నాయ పంటలపై రైతుల్లో అవగాహన కల్పించామని గుర్తు చేశారు. లాభసాటి వ్యవసాయంతో రైతులు ఆర్థికంగా మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నందిమల్ల అశోక్, కర్రె స్వామి, రఘువర్ధన్‌రెడ్డి, ధర్మానాయక్, రవిప్రకాశ్‌రెడ్డి, రాజశేఖర్, మహేశ్వర్‌రెడ్డి, చిట్యాల రాము తదితరులు పాల్గొన్నారు.
Read Also: జెన్ జీ.. వయా ఇన్‌స్టా.. మోదీ నయా ప్లాన్!
Follow Us On : WhatsApp

