కలం, జోగుళాంబ గద్వాల: రైతు సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, సాగునీటి విషయంలో రైతులు ఎలాంటి అపోహలు, ఆందోళనలు చెందాల్సిన అవసరం లేదని గద్వాల ఎమ్మెల్యే (Gadwal MLA) బండ్ల కృష్ణమోహన్ రెడ్డి(Bandla Krishna Mohan Reddy) అన్నారు. బుధవారం ధరూర్ మండలంలో జూరాల ప్రాజెక్టు కుడి కాలువ ద్వారా సాగునీటిని విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎగువ ప్రాంతాలలో ఎల్‌నినో (El Nino) ప్రభావంతో వర్షపాతం తగ్గినప్పటికీ రైతుల పంటల అవసరాలను దృష్టిలో ఉంచుకుని జూరాల కాలువలకు నీటిని విడుదల చేసే నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, మంత్రి వాకిటి శ్రీహరి, సహచర ఎమ్మెల్యేల సహకారంతో ఈ నిర్ణయం సాధ్యమైందని పేర్కొన్నారు.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy)కి రైతుల సమస్యలపై పూర్తి అవగాహన ఉందని, దాదాపు 30 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలిపారు. జూరాలకు (Jurala) వస్తున్న ఇన్‌ఫ్లోను దృష్టిలో ఉంచుకుని నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం పరిధిలోని ర్యాలంపాడు, గూడెందొడ్డి పంప్‌హౌస్‌ల మోటార్లను ఇప్పటికే ప్రారంభించామని, రిజర్వాయర్‌ల ద్వారా కాలువలకు నీటిని తరలిస్తున్నామని వెల్లడించారు. అలాగే ఎగువన ఉన్న నారాయణపూర్ డ్యామ్ గేట్లను కూడా ఎత్తి జూరాల ప్రాజెక్టుకు మరింత నీటిని విడుదల చేయనున్నట్లు చెప్పారు.
కాలువల ద్వారా విడుదల చేసిన నీటిని రైతులు వృథా చేయకుండా, రెండు పంటల అవసరాలకు సరిపడేలా దశలవారీగా పొదుపుగా వినియోగించాలని ఎమ్మెల్యే (Gadwal MLA) సూచించారు. నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తల సూచనల మేరకు తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటలు, ఆకుకూరలు, కూరగాయలు, పండ్ల తోటల సాగుకు ప్రాధాన్యం ఇవ్వాలని రైతులను కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
Read Also: జెన్ జీ.. వయా ఇన్‌స్టా.. మోదీ నయా ప్లాన్!
Follow Us On : WhatsApp

